
హైదరాబాద్‌లో రూ. 1.07 కోట్లు కొల్లగొట్టిన డిజిటల్ ముఠా అరెస్ట్
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.07 కోట్ల భారీ మోసానికి సంబంధించి ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
అరెస్ట్ అయిన వారిని గుర్దీప్ సింగ్ (లక్కీ నారంగ్), హర్ ప్రీత్ సింగ్ (కరణ్ కౌశిక్), కుమార్ మోహిత్ (మోహిత్ కౌశిక్)గా గుర్తించారు. వీరంతా ఢిల్లీ నివాసితులు. గుర్దీప్ సింగ్ మనీ ఎక్స్ఛేంజ్, ట్రావెల్ వ్యాపారం నిర్వహిస్తుండగా, హర్ ప్రీత్ సింగ్ ఆర్‌ఓ టెక్నీషియన్‌గా, కుమార్ మోహిత్ ఫుడ్ బిజినెస్ ప్లానింగ్‌లో ఉన్నట్లు తేలింది. వీరికి సహకరించిన దీపక్ కుమార్, ప్రశాంత్ కుమార్‌లను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66సీ, 66డీతో పాటు భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద నమోదు చేయబడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 2025 అక్టోబర్ 16న హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయనకు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చి, తన మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు అక్రమ కార్యకలాపాల్లో ఉపయోగించబడుతున్నాయని, ముంబై క్రైమ్ బ్రాంచ్ కేసులో ఇరుక్కుపోయారని భయపెట్టారు. విచారణాధికారి అంటూ నటించిన మోసగాళ్లు అరెస్ట్ చేస్తామని, ఉద్యోగ జీవితం దెబ్బతింటుందని బెదిరిస్తూ డబ్బు జమ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితుడు రూ.1.07 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాడు.
గ్యాంగ్ పని విధానం ప్రత్యేకంగా ఉండేది. బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడెన్షియల్స్ సేకరించి, ఖాతాదారులను ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లకు పిలిపించి కమిషన్ ఆఫర్లు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ ఖాతాల ద్వారా మోసపూరిత లావాదేవీలు నిర్వహించి, బాధితుల నుంచి వచ్చిన డబ్బును గ్యాంగ్ ప్రధాన నిర్వాహకుడికి చేరవేసేవారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వాటా ఇచ్చేవారు.
మోసగాళ్లు బాధితులను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేసే విధంగా ప్రవర్తించేవారని పోలీసులు తెలిపారు. పోలీసు, న్యాయ అధికారులుగా నటిస్తూ మనీలాండరింగ్, నార్కోటిక్స్ లేదా ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కుపోయారని భయపెట్టి, బెయిల్ లభించదని హెచ్చరించేవారు. సుప్రీంకోర్టుకు ఆస్తులను సమర్పించాల్సి ఉందని చెప్పి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించేవారు. అలాగే బాధితులను వీడియో కాల్స్ ద్వారా గంటగంటకు హాజరు కావాలని, స్వతంత్రంగా బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవద్దని ఆదేశించేవారు.
ఈ కేసును ఇన్స్పెక్టర్ కె. ప్రసాదరావు నేతృత్వంలోని బృందం గుర్తించింది. ఎస్ఐ ఏ. శైలేంద్ర కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు ఏ. సతీష్, పి.వి. శ్రీనివాస్, కానిస్టేబుళ్లు హెచ్. శేఖర్, డి. శేఖర్, జె. వెంకటేశ్ కలిసి దర్యాప్తు నిర్వహించారు. ఏసీపీ ఆర్.జి. శివ మారుతి పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
