
హైదరాబాద్‌లో రతన్ టాటా, డొనాల్డ్ ట్రంప్ పేర్లతో రోడ్లు..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని పరిసరాలలో అభివృద్ధి చేస్తున్న కీలక రహదారులకు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రముఖుల పేర్లను పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్‌లో భాగంగా నిర్మించబడుతున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటా పేరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెంబడి ఉన్న హై-ప్రొఫైల్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అనే పేరు పెట్టాలని కూడ ప్రభుత్వ ప్రతిపాదనలో ఉంది. ఈ నిర్ణయాల గురించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు అమెరికా దౌత్య కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన వార్షిక యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని కీలక రహదారులకు ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థల పేర్లు ఇవ్వాలనే ఆలోచనను వెల్లడించారు. ఆ దిశగా, గూగుల్ ప్రభావం గూగుల్ మ్యాప్స్ ప్రపంచ వ్యాప్త వినియోగాన్ని గుర్తిస్తూ, గూగుల్ నిర్మిస్తున్న కొత్త క్యాంపస్ (అమెరికా వెలుపల అతిపెద్దది) ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రహదారిని ‘గూగుల్ స్ట్రీట్’గా నామకరణం చేయాలని నిర్ణయించారు.
అదేవిధంగా మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన రోడ్, విప్రో జంక్షన్ లాంటి పేర్లను కూడా నగర టోపోగ్రఫీలో చేర్చాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ కేంద్రంగా మలచాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రకటించింది.
