
హైదరాబాద్‌లో మొబైల్ అంగన్‌వాడీలు: బస్తీ వాసులకు ముంగిటకే పోషకాహారం!
నగరంలోని మురికివాడలు, తక్కువ సదుపాయాలున్న ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ‘మొబైల్ అంగన్‌వాడీ’ యూనిట్లను ప్రవేశపెట్టనుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న బస్తీల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు సరైన భవనాలు దొరకకపోవడంతో, వాహనాల ద్వారా సేవలు అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.
నగరంలోని 274 మురికివాడల క్లస్టర్లను కవర్ చేస్తూ మొత్తం 37 వాహనాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు నేరుగా వారి నివాస ప్రాంతాల్లోనే పోషకాహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఒక్కో మొబైల్ యూనిట్‌ను సమీపంలోని శాశ్వత అంగన్‌వాడీ కేంద్రంతో అనుసంధానం చేయనున్నారు.
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో సుమారు 25,310 మంది చిన్నారులు, తల్లులు అంగన్‌వాడీ సేవల పరిధిలోకి రావాల్సి ఉన్నప్పటికీ, సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లోటును పూడ్చేందుకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేయించారు.
ఈ మొబైల్ అంగన్‌వాడీల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనుంది. వాహనాల అద్దె, ఇంధనం, సిబ్బంది వేతనాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌లో భాగంగా పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు ఈ పథకం దోహదపడనుంది.
ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన తుది ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడ్డాయి. త్వరలోనే వీటికి క్లియరెన్స్ లభించిన వెంటనే నగరం నలుమూలలా ఈ మొబైల్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల వలస కార్మికులు, పేద కుటుంబాలకు చెందిన వేలాది మందికి పోషకాహారం, ఆరోగ్య సలహాలు ఇంటి వద్దే లభించనున్నాయి.
కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి, వీటిలో 31,711 ప్రధాన కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. వీటి ద్వారా సుమారు 18 లక్షల నుండి 20 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు ప్రతిరోజూ పోషకాహారం, ఆరోగ్య సేవలను పొందుతున్నారు.
ఈ కేంద్రాల నిర్వహణ కోసం సుమారు 71,400 మంది టీచర్లు, సహాయకులు పని చేస్తుండగా, ప్రభుత్వం ఇటీవల 14,000 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. 'ఆరోగ్య లక్ష్మి' వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు, అద్దె భవనాల్లో ఉన్న సుమారు 12,221 కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అద్దె భవనాలు లభించని ప్రాంతాల్లో ఈ మొబైల్ యూనిట్ల ఏర్పాటుచేస్తున్నారు.
