Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ముగ్గురు డ్రగ్ పేడ్లర్లు అరెస్ట్: ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లో ముగ్గురు డ్రగ్ పేడ్లర్లు అరెస్ట్: ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం

Gaddamidi Naveen
25 డిసెంబర్, 2025

హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివిధ రకాల నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ బృందం డిసెంబర్ 22న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.

ఈ దాడుల్లో 25 ఏళ్ల ఈవెంట్ మేనేజర్‌ (ప్రధాన డ్రగ్ పేడ్లర్), అతనికి సహకరిస్తున్న ఇద్దరు సబ్‌-పేడ్లర్లు 21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 28 ఏళ్ల రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్ రైడర్‌ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ (టాస్క్ ఫోర్స్) గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి 22 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండీఎంఏ, 5.57 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఎస్డీపీఎస్ ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు ఓజీ, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, ఎక్స్‌టసీ పిల్స్‌ వంటి మాదక ద్రవ్యాలను పరారీలో ఉన్న సరఫరాదారుల ద్వారా, అలాగే డార్క్ వెబ్ (ఇంటర్నెట్) ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేసేవాడు అని తెలిపారు.

ఆర్థిక లావాదేవీలను గోప్యంగా ఉంచేందుకు క్రిప్టోకరెన్సీ వాలెట్లను ఉపయోగించగా, డ్రగ్స్‌ను కొరియర్ సేవల ద్వారా అందజేశారు. హైదరాబాద్‌లో వీటిని అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు ఆర్జించేవాడు. అతడు అందుబాటులో లేని సమయంలో అతని స్నేహితురాలు సబ్‌-పేడ్లర్‌గా వ్యవహరించగా, రైడ్-హైలింగ్ రైడర్ డ్రగ్స్ తరలింపు ఆర్థిక లావాదేవీలకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎన్.డీ.పీ.ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.