
హైదరాబాద్‌లో ముగిసిన 'అంతర్జాతీయ మిఠాయి పండుగ 2026'
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో, కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ సహకారంతో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్–2026ను ఘనంగా నిర్వహించారు. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. స్వీట్ ఫెస్టివల్‌తో పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కూడా ఒకేసారి నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి మహోత్సవాలు నగర జనాభాలో కనీసం 50 శాతం మందిని ఒకేచోటకు తీసుకొచ్చే శక్తి కలిగి ఉంటాయని, ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో, అలాగే వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు.
ఈ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ, దేశీయ కైట్ ఫ్లైయర్ల ప్రదర్శనలు, నైట్ కైట్ ఫ్లయింగ్, ఫుడ్ ఫెస్టివల్, అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్, అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ జరూర్ హై ఆనా అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో విస్తృతంగా ఆదరణ పొందింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సీఎల్ఐసీ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ, భారతదేశం అనేది విభిన్నతలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. మన వేషధారణ, ఆహారం, భాషలు వేర్వేరు అయినా, ఆ వైవిధ్యమే దేశాన్ని ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, ఆహారం ఎప్పుడూ ప్రజలను దగ్గర చేస్తుందని అన్నారు. భారతీయులకు తీపి అంటే ప్రత్యేకమైన మక్కువ ఉండటంతో, ఈ ఆలోచనతోనే 2017లో అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించామని తెలిపారు. గతంలో మూడు రోజులలోనే 12 నుంచి 15 లక్షల మంది సందర్శకులు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారని గుర్తు చేశారు.
సీఎల్ఐసీ సంస్థ వ్యవస్థాపక ట్రస్టీ, ఫెస్టివల్ నిర్వహణ కమిటీ సభ్యుడు అభిజీత్ భట్టాచార్య మాట్లాడుతూ, హైదరాబాద్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిన ‘మెల్టింగ్ పాట్’గా ఈ నగరం నిలుస్తుందని అన్నారు. ఈ స్వీట్ ఫెస్టివల్ ఆ హైదరాబాదీ తహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సమైక్యత ప్రధాన లక్ష్యంగా నిలిచింది. దేశంలోని 25కు పైగా రాష్ట్రాల మహిళలు, 15 అంతర్జాతీయ సముదాయాల మహిళలు పాల్గొని తమ తమ ప్రాంతాలకు ప్రత్యేకమైన ఇంటి వంటకాల తీపి పదార్థాలు, స్నాక్స్‌ను తయారు చేసి ప్రదర్శించారు. ఈ స్వీట్లు విక్రయించగా, అందులో వచ్చే లాభం పూర్తిగా గృహిణులకే అందేలా ఏర్పాట్లు చేశారు. ఫ్రమ్ కిచెన్ టు పబ్లిక్ అరెనా అనే భావనతో మహిళా సాధికారతకు ఈ ఫెస్టివల్ వేదికగా నిలిచిందన్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ కళా సంస్కృతుల గొప్పతనాన్ని చాటాయి. విభిన్న రాష్ట్రాలు, జాతీయతల కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ ఫెస్టివల్ ద్వారా మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, సాంస్కృతిక మార్పిడి లక్ష్యాలు విజయవంతంగా సాధించబడ్డాయని నిర్వాహకులు తెలిపారు.
