Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్: అట్టహాసంగా ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌లో మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్: అట్టహాసంగా ప్రారంభించిన సీఎం

Gaddamidi Naveen
9 మార్చి, 2026

నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదికైంది. ప్రతిష్టాత్మక మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. భారత్, ఉరుగ్వే జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.

ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.మార్చి 8నుంచి 14వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్ - ఏ లో ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్ - బీ లో ఇండియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇటువంటి అంతర్జాతీయ టోర్నమెంట్లు దోహదపడతాయని ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ వారం రోజుల పాటు హాకీ ప్రేమికులకు గచ్చిబౌలి స్టేడియం అద్భుతమైన వినోదాన్ని పంచనుంది.