
హైదరాబాద్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ
హైదరాబాద్ నగరంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలును కోరుతూ నిర్వహించిన “రన్ ఫర్ సోషల్ జస్టిస్” కార్యక్రమం విశేషంగా ముగిసింది. బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో జరిగిన ఈ రన్‌లో బీసీ సంఘాల కార్యకర్తలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని బీసీ జేఏసీ, వివిధ బీసీ సంఘాలు కలిసి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నాయకులు గుజ్జ కృష్ణతో పాటు వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.బీసీలకు దక్కాల్సిన హక్కులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందకుండా ఉన్నాయని, వారిని సామాజిక న్యాయంతో ముందుకు తీసుకెళ్లడానికి 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
రన్ అనంతరం నిర్వహించిన మీడియాతో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేంత వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ బిల్లు పాస్ అయిన తర్వాతే జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల జనాభా వాటాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని గుర్తుచేశారు. బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల దేశ అభివృద్ధికి కీలకమని, సరైన రిజర్వేషన్ విధానం మాత్రమే ఈ వర్గాలకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. బీసీలను దశాబ్దాలుగా వెనక్కు నెట్టిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ రన్ కేవలం ప్రతీకాత్మక కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీ యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని రిజర్వేషన్ల కోసం సమైక్య సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా, ఉత్సాహభరితంగా సాగి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిపింది.
