Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో బీజేపీ–కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎన్‌. రామచందర్ రావు అరెస్ట్
హైదరాబాద్‌లో బీజేపీ–కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎన్‌. రామచందర్ రావు అరెస్ట్

హైదరాబాద్‌లో బీజేపీ–కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎన్‌. రామచందర్ రావు అరెస్ట్

Gaddamidi Naveen
23 జులై, 2026

ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమం హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతకు, ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో ఒక టీవీ ఛానెల్ జర్నలిస్ట్‌తో పాటు ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యత్నం - అధ్యక్షుడి అరెస్ట్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామ‌చందర్ రావు నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయం నుంచి సమీపంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం (గాంధీ భవన్) వైపు ప్రదర్శనగా బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించారు.

పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకుని, రామ‌చందర్ రావును ముందస్తుగా అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రామ‌చందర్ రావు మాట్లాడుతూ.. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ సభకు హాజరుకాకుండా ప్రధాని నివాసం వద్ద వీధి నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆరోపించారు. రాహుల్ గాంధీ చర్య దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నమని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూనే శాంతియుతంగా నిరసన తెలిపిన తమను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చందర్ రావు అరెస్ట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి దేశమన్నా, ప్రజాస్వామ్యమన్నా గిట్టదని, దేశంలో అరాచకం సృష్టించి నేపాల్ తరహా పరిస్థితులను తీసుకురావాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని ఉపయోగించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున కాంగ్రెస్ నేతలు వీధి పోరాటాలు మాని సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు.

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ

ఇదిలా ఉండగా, బీజేపీ ఆందోళనకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ కూడా నిరసన చేపట్టడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. వారిని కూడా పోలీసులు మధ్యలో అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నిలబడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక స్థానిక టీవీ ఛానెల్ జర్నలిస్ట్‌ తలకు తీవ్ర గాయమవ్వగా, ఒక మహిళా కానిస్టేబుల్ కాలికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం రెండు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందిస్తూ.. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే, బీజేపీ కార్యకర్తలే జర్నలిస్టులు, పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మరోవైపు, బీజేపీ మాత్రం తమ నిరసన పూర్తిగా శాంతియుతంగానే సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో తమ నాయకులను అరెస్టు చేసి నిరసనను అణిచివేసే ప్రయత్నం చేసిందని ఆరోపించింది.