Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో పోలీస్ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం

హైదరాబాద్‌లో పోలీస్ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం

Gaddamidi Naveen
28 అక్టోబర్, 2025

ప్రతి సంవత్సరం నిర్వహించే పోలీస్ స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల గొప్ప బలిదానాలను గౌరవించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా చేపడుతున్నారు.

అక్టోబర్ 21న ప్రారంభమయ్యే పోలీస్ స్మారక వారోత్సవాలు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ధైర్యం, అంకితభావాన్ని స్మరించుకోవడానికి ఉద్దేశించబడింది.ఈ సందర్భంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ద్వారా, త్యాగ స్ఫూర్తిని ప్రాణదాతల రూపంలో కొనసాగించాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. రక్తదానం అనేది కేవలం ఒక సామాజిక కార్యక్రమం మాత్రమే కాదని, పోలీస్ అమరవీరుల త్యాగానికి నిజమైన నివాళి అని పోలిసులు పేర్కొన్నారు.

ఈ రక్తదాన కార్యక్రమం నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ డివిజన్లు, పోలీస్‌ శిక్షణా కేంద్రాలలో ఒకేసారి ప్రారంభమైంది. హైదరాబాదు పోలీసు కమిషనర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, పౌరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, పోలీసు అమరవీరులు సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను గౌరవించే ఉత్తమ మార్గం రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అని పేర్కొన్నారు.

రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్యసేవా సంస్థలకు అందించబడుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీని ద్వారా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, గర్భిణీ స్త్రీల అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని ఆయ‌న‌ తెలిపారు.

ఈ సందర్భంగా పౌరులకు పోలీసులు పిలుపునిస్తూ, “ప్రతి చుక్క రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. పోలీస్ అమరవీరుల త్యాగాలను గౌరవించే ఉద్దేశ్యంతో ఈ రక్తదాన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి” అని ఆహ్వానించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ప్రాణాలను రక్షించడంలో కీలకమైన రక్తదానానికి ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు.ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా సుమారు 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యమని పోలిసులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పోలీస్ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - Tholi Paluku