
హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత: దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డ్స్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ద ప్రభావం దేశీయ ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ఆ సెగలు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తాకుతున్నాయి. నగరంలోని పలుచోట్ల పెట్రోల్ బంకులు “నో స్టాక్” బోర్డులు ప్రదర్శించడం ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సరఫరాలో అంతరాయం, రవాణా సమస్యలు, ధరల పెరుగుదల వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నగరంలోని ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక బంక్ నుంచి మరో బంక్‌కు తిరుగుతూ ఇంధనం కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధుల తెలిపిన వివరాలప్రకారం, నగరంలో సుమారు 20నుంచి30 శాతం పెట్రోల్ బంకులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. సరఫరాలో ఉన్న అంతరాయం, ఆయిల్ కంపెనీల నుంచి సరైన సమయానికి స్టాక్ అందకపోవడం, పెరిగిన రవాణా ఖర్చులు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఇప్పటికే ఆయిల్ కంపెనీలు పవర్ పెట్రోల్ ధరలను పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇప్పుడు పెట్రోల్ కొరత కూడా తలెత్తడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బంకుల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తూ, కొందరు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. “నో స్టాక్” బోర్డులు చూసి వాహనదారుల్లో ఆందోళన పెరుగుతోంది.
ఈ పరిస్థితిపై నిపుణులు స్పందిస్తూ, అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే సరఫరా వ్యవస్థ పునరుద్ధరించబడుతుందని చెబుతున్నారు. తాత్కాలికంగా ఇంధన వినియోగాన్ని నియంత్రించడం, అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఇంధన ధరలు పెరగడంతో ఆటో డ్రైవర్లు కూడా చార్జీలను పెంచడం ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గ్యాస్ ధరలు పెరిగాయని చెబుతూ ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారు. మీటర్ కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం, చిన్న దూరాలకే ఎక్కువ చార్జీలు అడగడం వంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో రోజువారీ ప్రయాణం చేసే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఈ పరిస్థితిని నియంత్రించి, నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అంతేకాదు, ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులపై “గ్యాస్ సర్‌చార్జ్” పేరిట అదనపు మొత్తం వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరిగాయని కారణంగా చూపుతూ బిల్లులో కొన్ని రూపాయలు లేదా కొంత శాతం మేర చేర్చడం జరుగుతోంది. ఇది ఇప్పటికే పెరిగిన ఆహార ధరలతో ఇబ్బంది పడుతున్న కస్టమర్లపై మరింత భారం మోపుతోంది. ఇలాంటి అదనపు చార్జీలపై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని, వినియోగదారులను అన్యాయంగా భారం మోపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అయితే ఈ వార్తలపై నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, హైదరాబాద్లో ఇంధన, గ్యాస్ కొరత లేదు. పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆయన తన ట్వీట్లో "హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. నగరవ్యాప్తంగా తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా ఎక్కడ ఆగిపోలేదని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా (ఇరాన్-ఇజ్రాయెల్) యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు ప్రచారంతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టడం వల్ల అనవసరపు రద్దీ ఏర్పడుతోందని సీపీ పేర్కొన్నారు. గత రెండు, మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే చాలా చోట్ల వాహనదారులు పెట్రోల్ బంక్‌ల ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుకుంటున్నారు. అంతేకాకుండా క్యాన్లు, బాటిల్స్‌లో కూడా తీసుకెళ్తున్నారు. అందువలనే పలుచోట్ల పెట్రోల్ బంక్‌ల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు.
ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, దీనివల్ల సాధారణ సరఫరా వ్యవస్థకు ఆటంకం కలుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నగరంలోని తాజా పరిస్థితిని హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, పౌరసరఫరాల శాఖతో సమస్వయం చేసుకుంటూ సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
