
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మధురానగర్, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ప్రజలు ఇళ్లకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన సమయంలో వర్షం కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బోరబండ, ఎర్రగడ్డ, కృష్ణానగర్, మధురానగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. అమీర్‌పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ బ్యాక్ టు బ్యాక్‌గా కొనసాగింది. ఐటీ కారిడార్ వైపు వెళ్లే మార్గాల్లోనూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో జీహెచ్ఏంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు కొనసాగించారు.
ఇదిలా ఉండగా, రాబోయే కొద్ది గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వాహనదారులు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
