
హైదరాబాద్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి
హైదరాబాద్ శీతాకాల విడిదిలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాజధాని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం నిర్వహించిన 26వ జాతీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ సదస్సును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, దేశ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర అత్యంత కీలకమని, అందుకే రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఒక సంపూర్ణ భాగాన్ని సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అంకితం చేశారని పేర్కొన్నారు. ఇది కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులు, బాధ్యతలకు వారు ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుందన్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, యుపిఎస్సి చైర్మన్ అజయ్ కుమార్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అలాగే స్థితి, అవకాశాలలో సమానత్వం అనే మౌలిక సూత్రాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుకు దిక్సూచిలుగా ఉండాలని రాష్ట్రపతి సూచించారు. రాజ్యాంగ ప్రస్తావన, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానావకాశాలను హామీ ఇచ్చే మౌలిక హక్కులు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించే సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రానికి సూచించే ఆదేశాత్మక సూత్రాలు ఇవన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు స్పష్టమైన మార్గాన్ని సూచిస్తున్నాయని తెలిపారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కేవలం అవకాశాల్లో సమానత్వం సాధించడానికే పరిమితం కాకుండా, ఫలితాల్లో సమానత్వం అనే లక్ష్యాన్ని కూడా సాధించేందుకు ప్రయత్నించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సమానత్వం, న్యాయాన్ని ప్రోత్సహించే మార్పు దూతలుగా (చేంజ్ ఏజెంట్స్‌గా) పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ పరిపాలనలో “శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ”గా పిలవబడే సివిల్ సర్వీసులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఎంపికైన అధికారులు నిష్పాక్షికత, స్థిరత్వం, నిరంతరతను అందిస్తారని రాష్ట్రపతి అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాహిత విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే, ఆ శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు నిజాయితీ, సున్నితత్వం, సామర్థ్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో నిజాయితీ నైతిక విలువలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి హితవు పలికారు. నిజాయితీ, నైతికత అనేవి చర్చకు లేని అంశాలని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నైపుణ్యాలు, సామర్థ్యాల్లో లోపాలు ఉంటే శిక్షణ, అభ్యాస కార్యక్రమాల ద్వారా పరిష్కరించవచ్చని, కానీ నైతిక లోపాలు తీవ్ర సమస్యలకు దారి తీసి, అవి అధిగమించలేనివిగా మారవచ్చని ఆమె హెచ్చరించారు.
సివిల్ సర్వెంట్లుగా ఉద్యోగం కోరుకునే యువత అణగారిన, బలహీన వర్గాల కోసం పనిచేయాలనే మనసు కలిగి ఉండాలని రాష్ట్రపతి అన్నారు. ముఖ్యంగా మహిళల అవసరాలు, ఆశయాల పట్ల సివిల్ సర్వెంట్లు మరింత సున్నితంగా స్పందించాలని సూచించారు. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తమ కార్యకలాపాల్లో లింగ సమవేదన (జెండర్ సెన్సిటైజేషన్)కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో, అలాగే విస్తృతమైన వైవిధ్యం ఉన్న దేశంగా ఉన్నందున అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన పాలనా వ్యవస్థలు అవసరమని రాష్ట్రపతి అన్నారు. సమీప భవిష్యత్తులో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, అలాగే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు దేశం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మహత్తర లక్ష్యాల సాధనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సివిల్ సర్వెంట్ల బృందాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
