Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’: ఒక్క రాత్రికే 1,198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’: ఒక్క రాత్రికే 1,198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Gaddamidi Naveen
3 జనవరి, 2026

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 31-12-2025 సాయంత్రం 7:00 గంటల నుండి 01-01-2026 మధ్యాహ్నం 3:00 గంటల వరకు నగరం అంతటా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశం నూతన సంవత్సర వేడుకల సమయంలో రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని నిర్ధారించడమే. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రాణాంతక, ప్రాణహానికాని ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంచడం కూడా ఈ డ్రైవ్‌లో భాగంగా ఉంది. ఒక్క ప్రమాదం కూడా లేకుండా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలి అనే సంకల్పంతో ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో మొత్తం 1,198 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు అని పోలీసులు తెలిపారు. వాహనాల వారీగా చూస్తే, అత్యధికంగా ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలు 1,042 కేసులు, ఆటో రిక్షాలు 51 కేసులు, కార్లు, ఇతర వాహనాలు 105 కేసులు నమోదు చేశారు.హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి సహకరిస్తేనే నగర రహదారులు మరింత సురక్షితంగా మారతాయని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’: ఒక్క రాత్రికే 1,198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - Tholi Paluku