
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ‘ఐలైన్ స్టూడియోస్’ ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ‘ఐలైన్ స్టూడియోస్’ గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ప్రారంభించారు.
నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ ఒక ప్రముఖ ఇన్నోవేషన్ హబ్. ఇది అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, జనరేటివ్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సినిమా, వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభం కావడం ద్వారా భారతదేశం గ్లోబల్ ప్రొడక్షన్ వ్యవస్థలో కీలక స్థానం పొందనుందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులో అభివృద్ధి చేస్తున్న ప్రతిష్టాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో నెట్‌ఫ్లిక్స్ మరింత పెద్ద స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరించాలని ఆయన ఆహ్వానించారు.
అల్లాగే,హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, టాలీవుడ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ సంస్థ అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలపై పరిశోధనలు చేస్తూ సినిమా, సిరీస్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించడం రాష్ట్రానికి పెద్ద గుర్తింపని సీఎం పేర్కొన్నారు.
అంతేకాకుండా, రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.“ఇది నా కల సాకారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు. హైదరాబాద్ కేవలం టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్‌కు మాత్రమే కాకుండా హాలీవుడ్‌కు కూడా కేంద్రంగా మారాలి. నెట్‌ఫ్లిక్స్ ఇక్కడికి రావడం అంటే హాలీవుడ్ కూడా హైదరాబాద్‌కు చేరువవుతున్నట్లే, ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా కల త్వరలోనే నిజమవుతుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అవసరమైతే భారత్ ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయించి మరింత పెద్ద స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలన్నింటినీ అక్కడికి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
“మీ కార్పొరేట్ కార్యాలయం ఎక్కడ ఉందో నాకు తెలియదు. కానీ మీ కార్పొరేట్ కార్యాలయాన్ని మా భారత్ ఫ్యూచర్ సిటీకి మార్చాలని నేను కోరుతున్నాను. ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ప్రతి కంపెనీని అక్కడికి తీసుకురావడమే నా లక్ష్యం. ఈ విషయాన్ని నేను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా స్పష్టంగా చెప్పాను,” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, నెట్‌ఫ్లిక్స్ రెండూ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బ్రాండ్లని పేర్కొంటూ, ఈ నగరం నెట్‌ఫ్లిక్స్‌కు సహజమైన కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ క్రీడా రంగంపైనా ఎక్కువ దృష్టి పెట్టుతోందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోందన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనతో పాటు పలు క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఐలైన్ స్టూడియోస్ ప్రారంభం సంస్థ యొక్క ప్రపంచవ్యాప్త ప్రొడక్షన్ ఇన్నోవేషన్ మౌలిక వసతుల విస్తరణ వ్యూహంలో భాగం. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, తదుపరి తరం ప్రొడక్షన్ టెక్నాలజీలను హైదరాబాద్‌లో అభివృద్ధి చేయనున్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ కేంద్రం బలమైన హైబ్రిడ్ క్లౌడ్ మౌలిక వసతులతో పనిచేస్తుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఐలైన్ స్టూడియోస్‌కు ఇది ఐదవ కేంద్రం. ఇప్పటికే లాస్ ఏంజెల్స్, వాంకూవర్, సియోల్, లండన్ నగరాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రం దక్షిణాసియాలో ఒక కీలక ప్రొడక్షన్ హబ్‌గా మారే అవకాశం ఉందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా ఎదుగుతోందన్నారు. మీడియా, వినోద రంగాల్లో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
గత ఏడాది ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియోవిజువల్ ఎంటర్టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృజనాత్మక, సాంస్కృతిక పరిశ్రమలను ప్రోత్సహించే “ఆరెంజ్ ఎకానమీ” ప్రాధాన్యతను వివరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 15,000 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు, కాలేజీల్లో 500 ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించినట్లు తెలిపారు. వీటి ద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని చెప్పారు.
అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ బలమైన స్థానం కలిగి ఉండటంతో ఈ వృద్ధిలో నగరం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ త్వరలో హైదరాబాద్‌లో ప్రాంతీయ క్యాంపస్‌ను ప్రారంభించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో మాట్లాడుతూ, ప్రపంచ విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో భారత్ చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పెద్ద స్థాయి సామర్థ్యం మాత్రమే కాకుండా సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ భారత్‌లో సమృద్ధిగా ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో బలమైన సాంకేతిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ఇంజినీరింగ్ ప్రతిభ, అలాగే గొప్ప సినిమా సంస్కృతి ఉండటం వల్లే ఐలైన్ స్టూడియోస్ తమ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, సినీ నటుడు దగ్గుపాటి రానా,, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు, పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
