Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో దోమల బెడదపై తక్షణమే చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌లో దోమల బెడదపై తక్షణమే చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
9 మార్చి, 2026

హైదరాబాద్‌లో పెరుగుతున్న దోమల బెడదపై తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో దోమల సమస్యపై వరుసగా వస్తున్న ఫిర్యాదులు, ఇటీవల నిర్వహించిన హైదరాబాద్ జిల్లా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో దోమల సాంద్రతను తగ్గించేందుకు ఎంటమాలజికల్ సర్వైలెన్స్‌ను బలోపేతం చేయాలని సూచించారు. అధికంగా దోమలు ఉన్న ప్రాంతాల్లో 100 శాతం జ్వరం పర్యవేక్షణ చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా, వంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత మూడేళ్ల డేటా ఆధారంగా అధిక ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వార్డులు, ఎంటమాలజీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, దోమల పెంపక స్థలాలను జియో ట్యాగింగ్ చేయాలి. లార్వా సాంద్రత మ్యాపింగ్ ద్వారా పరిస్థితులను సమీక్షించాలి.

గత 12 నెలల్లో నమోదైన డెంగ్యూ, మలేరియా, కేసుల ఆధారంగా పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, నీటి నిల్వ ప్రాంతాలు, స్లమ్ ప్రాంతాలను గుర్తించి వార్డ్ వారీగా మైక్రో ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి వారం “డ్రై డే” నిర్వహిస్తూ ఇళ్లలో, పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించాలని మంత్రి పేర్కొన్నారు. టెమెఫోస్ వంటి రసాయనాల వినియోగం, చేపల ద్వారా లార్వా నియంత్రణ, చెరువులు, కాలువల్లో ఆయిల్ బాల్స్ విడుదల వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికీ జ్వరం పర్యవేక్షణ చేయడంతో పాటు అవసరమైతే ఫీవర్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు నిర్వహించాలని, పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఆదివారం 10 నిమిషాలు దోమల నివారణకు అనే కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల నియంత్రణలో సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.