
హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రేమికుడు
వివాహం చేసుకోవడానికి నిరాకరించాడన్న కారణంగా జరిగిన గొడవలో ప్రియురాలిని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన 23 ఏళ్ల యువతి ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పనిచేస్తోంది. కూలీగా పనిచేసే నిందితుడితో ఆమెకు ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. గత రెండు నెలలుగా ఆమె నిందితుడి ఇంట్లోనే ఉంటోంది. వివాహం చేసుకోవాలని యువతి కోరగా.. నిందితుడు అందుకు నిరాకరించడంతో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిందితుడు కత్తితో యువతిని పొడిచి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతురాలి చేతులు, కాళ్లను కట్టి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
స్థానికుల సమాచారంతో
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో రక్తపు మరకలతో ఉన్న గోనె సంచిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతి గర్భవతి అన్న ప్రచారంపై పోలీసులు స్పందిస్తూ.. పోస్టుమార్టం అనంతరం మాత్రమే వాస్తవం తెలుస్తుందని తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని దాచిపెట్టడంలో నిందితుడి తల్లి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
