
హైదరాబాద్‌లో డ్రగ్స్ నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సమన్వయ భేటీ
మాదకద్రవ్యాల (డ్రగ్స్) నియంత్రణ చర్యలను పటిష్టం చేసే లక్ష్యంతో, కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో కూడిన అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ గ్లోబల్ ఇన్నోవేషన్ కన్వెన్షన్ సెంటర్ (టీజీఐసీసీసీ) లో జరిగింది.
ఈ సమావేశానికి ఐబీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర ఏజన్సీలు చురుకుగా పాల్గొన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సంజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడం, సమాజాన్ని ప్రభావితం చేస్తున్న మాదక మహమ్మారిని తగ్గించడం కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అలాగే ఈ భేటీలో, మాదకద్రవ్యాలు, రౌడీషీట్లు, నేరగాళ్లపై ఎటువంటి పద్ధతిలో పర్యవేక్షణ ఉంచుతామో, అందుకు అనుగుణంగా నిఘా విధానం రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. నేరగాళ్ల వలన శాంతిభద్రతలకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను సమగ్రంగా నియంత్రించేందుకు ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ (హెచ్-న్యూ) బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో డ్రగ్స్ వ్యాప్తి నిరోధక చర్యలను మరింత సమర్థవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన ఒకరోజే సాధ్యంకాని, నిరంతర పోరాటం కావడంతో అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.
ఇకపై ప్రతినెలా అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షించడం కూడా నిర్ణయించబడిందన్నారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని అడ్డుకోవడంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో, ప్రతి ఏజన్సీ బృందం తాము చేపడుతున్న చర్యల్లో పూర్తి స్థాయి చురుకైన సహకారం చూపించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. అలాగే, డ్రగ్స్ వ్యాప్తిని అడ్డుకోవడంలో నగరంలో సాధ్యమైనంత త్వరగా, సమగ్రంగా ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని ధృవీకరించారు.
