
హైదరాబాద్‌లో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్-8
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఎనిమిదో సీజన్ హైదరాబాద్‌లో జరగనుంది. డిసెంబర్ 8 నుంచి 13 వరకు ఎల్‌బీ టెన్నిస్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎనిమిది జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. టీపీఎల్ ప్రత్యేకమైన 25 పాయింట్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఈ సీజన్‌లో జీఎస్ ఢిల్లీ ఏసెస్, హైదరాబాద్ స్ట్రైకర్స్, లక్నో బ్లేజర్స్, గుర్గావ్ గ్రాండ్ స్లామర్స్, గుజరాత్ పాంథర్స్, రాజస్థాన్ రేంజర్స్, కోల్‌కతా థండర్ బ్లేడ్స్, ముంబై రాయల్స్ జట్లు పాల్గొంటాయి. టీపీఎల్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచస్థాయి టెన్నిస్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా లీగ్ సహ వ్యవస్థాపకుడు కునాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి టెన్నిస్‌ను మొదటిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడమే కాకుండా, కియా ఇండియా భాగస్వామ్యంతో ఈ సీజన్ జరగడం విశేషం. హైదరాబాద్‌లోని క్రీడా సంస్కృతి ఈ లీగ్ విస్తరణకు ఎంతో అనుకూలమైనదని అన్నారు. గత సీజన్ అహ్మదాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది.
