Let's talk: editor@tmv.in
హైద‌రాబాద్‌‌లో ‘ఛలో లోక్ భవన్’.. మంత్రులు, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌
హైద‌రాబాద్‌‌లో ‘ఛలో లోక్ భవన్’.. మంత్రులు, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌
హైద‌రాబాద్‌‌లో ‘ఛలో లోక్ భవన్’.. మంత్రులు, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

హైద‌రాబాద్‌‌లో ‘ఛలో లోక్ భవన్’.. మంత్రులు, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

Gaddamidi Naveen
23 జులై, 2026

ఢిల్లీలో రాహుల్ గాంధీని అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సి. దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ‘ఛలో లోక్ భవన్’ ముట్టడికి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లోక్ భవన్ వైపు సాగింది.

ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కార్యకర్తలు బారికేడ్లను నెట్టి ముందుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ప్రదర్శనకారులను అడ్డుకుని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో సహా పలువురు ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నియంతృత్వ ధోరణులను, అణచివేత చర్యలను దేశ ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు. రాహుల్ గాంధీని అరెస్టు చేసినంత మాత్రాన లేదా ఇటువంటి దమనకాండ చర్యలకు పాల్పడినంత మాత్రాన ఆయన గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత న్యాయమైన హక్కుల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.

హన్మకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరసన

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ హన్మకొండ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన సాగుతోందని, నీట్ లీకేజీతో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థను రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కాగా, నీట్ పరీక్షల అక్రమాలపై ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాను పోలీసులు బలవంతంగా భగ్నం చేసి వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.