
హైదరాబాద్‌లో కల్తీ కలకలం
నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ దారుణంగా పెరిగిపోతోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, డ్రై ఫ్రూట్స్ నుంచి నిత్యావసరాల వరకు ప్రతి వస్తువును వ్యాపారులు రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. తమ నివాసాలనే రహస్య తయారీ కేంద్రాలుగా మార్చుకుని, ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ వస్తువులను మార్కెట్లోకి వదులుతున్నారు. తక్కువ ధరలకే ఇవి లభిస్తుండటంతో స్థానిక దుకాణదారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ విషపూరిత ఆహారాన్ని తినడం వల్ల సామాన్యులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, వ్యాపారులు మాత్రం ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ కల్తీ మాఫియా గుట్టును రట్టు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, ఆయా దుకాణాలను సీల్ చేస్తున్నారు. ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ముఠాలపై హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. హానికర రసాయనాలు కలిపి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, శాస్త్రిపురం ప్రాంతంలోని బాబా కంటా సమీపంలో ఉడంగడ్డలో రైల్వే ట్రాక్ దగ్గర నడుస్తున్న అక్రమ తయారీ యూనిట్లపై దాడులు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అలీమ్, జసాని దిల్దార్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నాసిరకం ముడి పదార్థాలతో పాటు ఉప్పు, టైటానియం డయాక్సైడ్, జాన్‌థన్ గమ్ వంటి రసాయనాలు కలిపి పేస్ట్‌ను మందంగా కనిపించేలా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడుల్లో 1,800 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 2 కిలోల జాంథన్ గమ్ పౌడర్, 2 కిలోల టైటానియం డయాక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్, ఏడు ప్యాకింగ్ యంత్రాలు, మూడు గ్రైండింగ్ యంత్రాలు, రెండు తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో మార్చి 11న మరో దాడి జరిపిన పోలీసులు మొహమ్మద్ జియౌద్దీన్ (45), మొహమ్మద్ మజర్ అలీ (47)లను అరెస్టు చేశారు. సుభాన్ కాలనీ, అల్లీ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోనే వీరు అల్లం పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సెవెన్ కుక్స్, అర్జున్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల దాడుల్లో 675 కిలోల అల్లం పేస్ట్, 16 డ్రమ్‌లు, ½ కిలో ప్యాకెట్ల కార్టన్లు, లేబుళ్లు, జాన్‌థన్ గమ్ పొడి వంటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన పేస్ట్ విలువ సుమారు రూ.90 వేలుగా అంచనా వేశారు.హానికర పదార్థాలు కలిపి తయారు చేసిన ఈ పేస్ట్‌ను హైదరాబాద్‌లోని స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
నగరంలో కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుళ్ళిపోయిన, అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను విక్రయిస్తున్న అసవా మనీష్ (42) అనే వ్యక్తిని ప్రత్యేక నేర దర్యాప్తు బృందం (సీసీఎస్), ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్‌పురా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చార్మినార్ సమీపంలోని చేలాపురాలో 'జెమ్ ఫుడ్స్ (ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్)' పేరుతో ఒక గోడౌన్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. వినియోగానికి ఏమాత్రం పనికిరాని, ఫంగస్ పట్టి దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను మేలైన రకమని నమ్మించి విక్రయిస్తున్నాడు. జాయింట్ టీమ్ నిర్వహించిన సోదాల్లో నిల్వ ఉంచిన 30 కార్టన్ల పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో వీటిని నిల్వ ఉంచడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ అరెస్టు ప్రత్యేక నేర బృందం ఇన్‌స్పెక్టర్ డి. బిక్షపతి, ఆయన సిబ్బంది, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదుర్‌పురా పోలీసుల పర్యవేక్షణలో జరిగినది. ప్యాక్ చేసిన లేదా బల్క్ ఫుడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా దుకాణంలో కల్తీ లేదా పాడైపోయిన వస్తువులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కోరారు. కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
