
హైదరాబాద్‌లో కలుషిత నీటికి 'రోబో' చెక్!: హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ప్రత్యేక కార్యాచరణ
నగరవాసులను వేధిస్తున్న కలుషిత నీటి సరఫరా సమస్యను పూర్తిగా రూపుమాపేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి ఫిర్యాదులను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా సరికొత్త ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. డేటా విశ్లేషణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. నగరవాసులకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గత రెండేళ్ల కాలుష్య నీటి ఫిర్యాదులపై సమగ్ర విశ్లేషణ చేపట్టారు. మెట్రో కస్టమర్ కేర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను విభాగాల వారీగా పరిశీలించి, ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించారు. ముఖ్యంగా లీకేజీలు, పాత పైపులైన్లు, మురుగు నీటి కలయిక వంటి సమస్యలకు లోనయ్యే సున్నిత ప్రాంతాలను మ్యాప్ చేశారు.
ఈ విశ్లేషణ ఆధారంగా నగరంలో వాడుకలో ఉన్న పాత శిథిలమైన పైపులైన్లను గుర్తించి, వాటిని రెండు నెలల వ్యవధిలో పూర్తిగా మార్పిడి చేయాలని నిర్ణయించారు అని డైరెక్టర్ తెలిపారు. దీంతో పాటు పైపులైన్ల నిర్వహణలో లోపాలు లేకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సమస్య తలెత్తిన వెంటనే స్పందించేలా ఫీల్డ్ స్థాయిలో చర్యలు వేగవంతం చేయనున్నారు.
కాలుష్యానికి గల అసలు కారణాలను కచ్చితంగా గుర్తించేందుకు అత్యాధునిక రోబోటిక్ పైప్ ఇన్‌స్పెక్షన్ కెమెరా వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా పైపుల లోపలి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, అంతర్గత లీకేజీలు, చీలికలు, మురుగు నీటి కలయిక వంటి అంశాలను గుర్తించవచ్చు. దీని వల్ల సమస్య ఉన్న ప్రాంతంలో తక్షణమే మరమ్మతులు చేపట్టి, కాలుష్య నీటి సరఫరాను అరికట్టడం సాధ్యమవుతుంది.
ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుతో హైదరాబాద్ నగరమంతటా సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగుతుందని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నీటి ఫిర్యాదులను పూర్తిగా నిర్మూలించి, ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన అడుగు వేయడమే ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశమని అశోక్ రెడ్డి తెలిపారు.
