
హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: ఎలక్ట్రిక్ స్టవ్ వైపు టిఫిన్ సెంటర్ల మొగ్గు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భాగ్యనగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కొరత కారణంగా హైదరాబాద్‌లోని చిరు వ్యాపారులు గ్యాస్ సిలిండర్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నగరంలోని అనేక టిఫిన్ సెంటర్లు ఇప్పుడు వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్ వైపు మళ్లుతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలు - దొరకని సిలిండర్లు
నగరంలోని దేవి నాస్తా పాయింట్ షెఫ్ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితి తీవ్రతను వివరించారు. సాధారణంగా రూ. 1,800 నుంచి రూ. 1,900 వరకు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ. 4,000 కు చేరిందని, అంత ధర చెల్లించినా సిలిండర్లు దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ లేకపోవడంతో గత్యంతరం లేక ఎలక్ట్రిక్ స్టవ్లపై ఆధారపడుతున్నామని, అయితే ఇప్పుడు మార్కెట్లో ఆ స్టవ్లు కూడా దొరకడం గగనమైందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కమర్షియల్ ఎల్పీజీ కొరత కొనసాగుతుండటంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను వినియోగించడం ప్రారంభించాయి. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో కూడా ఎలక్ట్రిక్ స్టవ్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. స్థానిక వ్యాపారి లక్ష్మణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు నుంచి మూడు రోజులుగా వినియోగదారులు భారీ సంఖ్యలో ఇండక్షన్ స్టవ్‌ల కోసం వస్తున్నారు. అయితే సరఫరా తగినంతగా లేకపోవడంతో స్టాక్ కొరత ఏర్పడింది. కొత్త సరఫరా వచ్చే వరకు అనేక ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఒకటి లేదా రెండు స్టవ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.హైదరాబాద్‌లోనే కాకుండా సూరత్, బెంగళూరు, భోపాల్ వంటి మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మరో వ్యాపారి దినేష్ పటేల్ మాట్లాడుతూ తమ దుకాణంలో ఎలక్ట్రిక్ స్టవ్‌ల స్టాక్ పూర్తిగా అయిపోయిందని చెప్పారు. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఇతర దుకాణాల నుంచి స్టవ్‌లను కొనుగోలు చేసి అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత కారణంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని చోట్ల తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సరఫరా కొనసాగిస్తున్నారని ఎల్పీజీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల గ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 శాతం వరకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. త్వరలో కొత్త ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా రానున్నదని, దీంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.
