Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ఇంధనం, గ్యాస్ కొరత లేదు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధనం, గ్యాస్ కొరత లేదు: సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
25 మార్చి, 2026

నగరంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందనే వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, నగరవ్యాప్తంగా తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా సజావుగా సాగుతోందని తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందవద్దు. ఇంధన కేంద్రాల వద్దకు ఒకేసారి భారీగా తరలిరావడం వల్ల అనవసరమైన ట్రాఫిక్ జామ్‌లు, అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ కంగారు పడవద్దు అని సీపీ కోరారు. పరిస్థితిని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై సీపీ భావోద్వేగ సందేశం

ఇదే సందర్భంలో, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన తల్లిదండ్రుల మద్దతు బిల్లు పై సీపీ సజ్జనార్ అత్యంత భావోద్వేగంతో స్పందించారు. కేవలం ఒక పోలీస్ అధికారిగా కాకుండా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

తల్లిదండ్రులను మరిచిపోయే సమాజం తన ఆత్మను కోల్పోతుందని ఆయన అన్నారు. తమను నడక నేర్పిన చేతులను, తమ కోసం ఆకలితో అలమటించిన తల్లిదండ్రులను నేడు పిల్లలు విస్మరించడం బాధాకరం. మనకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం ఒక నిశ్శబ్ద ద్రోహమని వ్యాఖ్యానించారు. మన కోసం త్యాగాలు చేసిన వారు ఈ రోజుల్లో ఒంటరిగా మిగిలిపోతుండటం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రేమతో చేయాల్సిన పనిని పిల్లలు చేయనప్పుడు, చట్టం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఒక సామాజిక సంక్షోభానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతను విస్మరించిన వారి జీతం నుంచి కొంత మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందజేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఒక హెచ్చరికగా వంటిదని కొనియాడారు. ఆర్థిక వృద్ధి కంటే విలువలకే ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులకు కావాల్సింది సంపద కాదు, తమ పిల్లల తోడు, సంభాషణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

ఈ ధైర్యవంతమైన, మానవీయమైన చట్టాన్ని తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సీపీ సజ్జనార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులను గౌరవించండి.. అది చట్టం కోరుతుందని కాదు, వారు లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండరనే నిజాన్ని గ్రహించి గౌరవించండి అని ఆయన పిలుపునిచ్చారు.