
హైదరాబాద్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల విక్రయం..10 మంది అరెస్ట్
నగరంలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి భారీ ఎత్తున 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నగరంలో కొందరు వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారన్న నమ్మకమైన సమాచారం మేరకు, కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితులు నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అవసరమున్న వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడు ఒక గ్యాస్ ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సదరు నిందితుడు కార్మికుల సహాయంతో బంజారాహిల్స్ ప్రాంతంలో రహస్యంగా గ్యాస్ సిలిండర్లను డమ్పింగ్ చేస్తున్నాడని, భద్రతా నియమాలను తుంగలో తొక్కి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నాడని విచారణలో తేలింది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
పోలీసులు నిందితుల వద్ద నుంచి మొత్తం 414 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 213 నిండుగా ఉన్న సిలిండర్లు కాగా, 201 ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. వీటితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 11 వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. లాభాపేక్షతో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
