Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘స్విస్ మాల్’

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘స్విస్ మాల్’

Dantu Vijaya Lakshmi Prasanna
23 జనవరి, 2026

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌తో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డవోస్‌లో వరుస భేటీలతో దూసుకుపోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిపాదించిన 'స్విస్ మాల్' ఆలోచన ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి వినూత్న ప్రయోగం

స్విట్జర్లాండ్‌లోని వాడ్ కౌన్సిల్ ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూయిసియర్ బ్రోడార్డ్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఒక 'స్విస్ మాల్'ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది కేవలం ఒక షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కాకుండా, స్విస్ సంస్కృతి, ఉన్నత స్థాయి జీవనశైలి, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల కలయికగా ఉంటుందన్నారు. ప్రపంచంలోనే ఇలాంటి మాల్ ఇప్పటివరకు ఎక్కడా లేకపోవడం గమనార్హం అని రేవంత్ అనగా ఈ ప్రతిపాదన పట్ల స్విస్ ప్రతినిధి బృందం అద్భుతమైన సానుకూలత వ్యక్తం చేసింది.

క్రీడలు, విద్య నైపుణ్యాభివృద్ధిపై దృష్టి

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇరువురు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ క్రీడాకారులు కావడంతో, తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు, స్విస్ నైపుణ్యంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, రిటైల్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉత్తమ విధానాల మార్పిడి కూడా ప్రస్తావించారు. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మోడల్‌ను స్విస్ ప్రతినిధులు ప్రశంసించారు. వీరికి మరింత చేయూతనిచ్చే మార్గాలపై చర్చించారు.

త్వరలోనే స్విస్ బృందం హైదరాబాద్ రాక

ఈ ప్రాజెక్టుల విధివిధానాలను ఖరారు చేసేందుకు వాడ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఇసాబెల్లె మోరెట్ నేతృత్వంలోని ఒక బృందం త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించనుంది. ఇదిలా ఉండగా, డవోస్ సదస్సులో తెలంగాణ ఇప్పటి వరకు సుమారు రూ. 5.75 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని సీఎం వెల్లడించారు.

రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ 'స్విస్ మాల్' నిర్ణయం హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ పటంలో మరో మెట్టు ఎక్కించనుంది.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘స్విస్ మాల్’ - Tholi Paluku