
హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-167 ను 4-లేన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు సుమారు 80.01 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రూ.3,175.08 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ద్వారా ఈ పనులు అమలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ – పనాజీ మార్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ముఖ్యంగా నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది. ఎన్‌హెచ్-150, ఎన్‌హెచ్-167ఎన్ రహదారులతో అనుసంధానం కలగడంతో సరుకు రవాణా వేగవంతమై లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఈ భారీ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. నిర్మాణ సమయంలో దాదాపు 14.4 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి, 17.9 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడం వల్ల స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ యువతకు, వ్యాపార వర్గాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
