
హైదరాబాద్‌ను ‘ప్రపంచ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ రాజధాని’గా మారుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయోఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు మంగళవారం హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాల దిగ్గజ కంపెనీలకు, శాస్త్రవేత్తలకు, నిపుణులకు ఒక శక్తివంతమైన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి బయో-ఫార్మా పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు ఇక్కడి నైపుణ్యం కలిగిన యువత పెట్టుబడిదారుల విజయానికి భాగస్వాములుగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు.
సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లతో పోటీ పడుతున్నదని తెలిపారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) స్థాపనకు ప్రపంచంలో ప్రాధాన్యత పొందుతున్న నగరంగా ఎదిగిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇక్కడ తమ ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఔషధ రూపకల్పన, క్లినికల్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో విస్తరించాలని ఆయన ఆహ్వానించారు.
తెలంగాణ రైజింగ్ 2047 – ఆర్థిక లక్ష్యాలు
ఒకప్పుడు చార్మినార్, బిర్యానీ, సాఫ్ట్‌వేర్ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్, నేడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిందని సీఎం కొనియాడారు. మనందరం కలిసి పనిచేస్తే, హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉండటాన్ని మించి, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ అంటే ప్రగతి. ఈ ఎదుగుదలలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
గడిచిన రెండేళ్లలోనే జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం తెలంగాణ పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన తెలిపారు. జినోమ్ వ్యాలీ విస్తరణ, గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి మరియు 'వన్-బయో' ప్రారంభం వంటి చర్యలు ఈ పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు. ప్రస్తుతం బయోఏషియా ‘బయోవరల్డ్’గా రూపాంతరం చెందిందని, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో 500 ప్రముఖ సంస్థలు, 4 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ వేడుకలో భాగంగా పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026ను అందజేశారు.
ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుంటే, పరిశోధనా సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, ప్రభుత్వం మధ్య సమన్వయం అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఎకోసిస్టమ్‌ను కోరుకుంటున్నారని, తెలంగాణ ఆ దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడులు, ఉపాధి లక్ష్యాలు: మంత్రి శ్రీధర్ బాబు
ఇదే సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ దశాబ్దం ముగిసేలోపు ప్రపంచంలోని టాప్ మూడు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను నిలబెట్టడం లక్ష్యమని తెలిపారు. రాష్ట్రం సుమారు 25 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఐదు లక్షల వరకు అధిక విలువ కలిగిన ఉద్యోగాలను సృష్టించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ను ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. అలాగే తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ద్వారా తదుపరి తరం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను తయారుచేయడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, జీన్ థెరపీ, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక రంగాల్లో శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
మొత్తంగా, బయోఏషియా వేదికగా తెలంగాణను ప్రపంచ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నదని ప్రభుత్వం ప్రతిపాదనలు తెలియజేసింది. పెట్టుబడులు, పరిశోధన, నైపుణ్యం, ఆవిష్కరణలు అన్ని కలిసి పనిచేసినప్పుడు తెలంగాణ గ్లోబల్ బయోఫార్మా రంగంలో కీలక స్థానాన్ని సంపాదించగలదనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు.
