
హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం:సీఎం రేవంత్
యూసుఫ్‌గూడలో సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక ప్రకటనలు చేశారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ కృష్ణా నగర్‌లో ఒక మంచి స్థలాన్ని గుర్తించి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మించి, సినీ కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను” అని ప్రకటించారు.
అలాగే, సినీ కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తాం. అదనంగా, కార్మికుల భవిష్యత్తు భద్రత కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయండి. ఆ నిధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు అందిస్తాం” అని తెలిపారు.
భవిష్యత్తులో సినిమా టికెట్ల ధరలు పెంచాలనుకునే నిర్మాతలు లేదా సంస్థలు తమ ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు కేటాయిస్తేనే అనుమతులు ఇవ్వాలని కొత్త నిబంధనలపై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన చెప్పారు.
రాత్రింబగళ్లు శ్రమించే సినీ కార్మికుల కష్టమే తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. వారి అంకితభావం లేకుండా ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమా చేరేది కాదు” అని సీఎం పేర్కొన్నారు.గతంలో నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.
అలాగే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమకు వేదికగా మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ రూపకల్పన జరుగుతోందని సీఎం పేర్కొన్నారు.సినీ కార్మికుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం పునరుద్ఘాటించారు.
