
హైదరాబాద్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణను సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతోందని ఆయన వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో క్యూర్ పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో కలిసి వాతావరణ మార్పులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వివరించారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు కీలకమని, రాష్ట్ర అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న రాష్ట్ర జీడీపీని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్‌లుగా విభజించినట్లు వివరించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిధిని క్యూర్ గా అభివృద్ధి చేస్తుండగా, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ప్యూర్ జోన్‌గా రూపొందించి తయారీ రంగానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్ది చైనా +1 ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే లక్ష్యమని సీఎం అన్నారు. ఈ తయారీ వృద్ధి పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, 2034 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగంలో గ్రీన్ ఎనర్జీ వాటా 25 శాతంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో తెలంగాణను గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు.
