
హైదరాబాద్‌ను 'క్వాంటమ్ సిటీ'గా అభివృద్ధి చేస్తాం - మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌ను "క్వాంటమ్ సిటీ"గా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో నిర్వహించిన క్వాంటం పవర్డ్ ఎకానమీ స్ట్రాటజీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత సంవత్సరాలలో విద్యుత్తు, ఇంటర్నెట్ ఎంతటి పరివర్తనాత్మకంగా ఉన్నాయో, 21వ శతాబ్దంలో క్వాంటమ్ సాంకేతికత కూడా అంతే మార్పును పొందే శక్తిని కలిగి ఉందని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అధునాతన డిజిటల్ సిస్టమ్స్‌తో పాటు క్వాంటమ్ టెక్నాలజీలలో తెలంగాణ గ్లోబల్ లీడర్‌గా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన, దీర్ఘకాలిక దృష్టి ఉందని ఆయన ఉద్ఘాటించారు. పరిశోధన మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలు మానవ వనరుల అభివృద్ధిని బలోపేతం చేయడంతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, సెన్సింగ్ క్రిప్టోగ్రాఫిక్ సెక్యూరిటీలో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడం ఈ వ్యూహం లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ ఫ్రేమ్‌వర్క్‌ను కేవలం రాష్ట్రానికి సంబంధించిన విధాన పత్రంగా కాకుండా, క్వాంటమ్ సైన్స్, టెక్నాలజీతో భారతదేశం అనుసంధానం కోసం ఒక దిశాత్మక రోడ్‌మ్యాప్‌గా రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా, పరిశోధన, పరీక్షలు ఉన్నత స్థాయి నైపుణ్యాల అభివృద్ధికి జాతీయ బెంచ్‌మార్క్‌గా పనిచేయడానికి ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీలలో ప్రత్యేక "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ను ఏర్పాటు చేయనుంది.
డీప్-టెక్ స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సంస్థలకు మద్దతుగా ఈ “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి "ఫండ్ ఆఫ్ ఫండ్స్" అనే కార్యక్రమం ప్రారంభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు.
పరిశ్రమల ప్రతినిధులతో సీనియర్ ప్రభుత్వ అధికారులు వారానికోసారి సంభాషించే "ఇండస్ట్రీ డే" కార్యక్రమాన్ని రూపొందిస్తామని, అలాగే కార్యకలాపాల సవాళ్లను పరిష్కరించడానికి, ఉమ్మడిగా రంగాల నిర్దిష్ట వృద్ధి వ్యూహాలను రూపొందించడానికి మంత్రులు, వ్యాపార నాయకులతో నెలవారీ సంప్రదింపులు జరిపే ఏర్పాటును కూడా చేస్తామని మంత్రి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
