
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆరోపణల నేపథ్యంలో పూర్తి పారదర్శకతతో కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్లు పాలసీ లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, కొద్దిమంది వ్యక్తుల కోసం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ త్వరలో ప్రజల ముందుంచుతామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పారదర్శకమైన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ పాలసీని తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉన్నతాధికారులు, భాగస్వాములతో చర్చించి, కేబినెట్‌లో విస్తృతమైన పరిశీలన తరువాతనే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని ఆయన వివరించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఆయన, ప్రజలపై పన్నులు వేయాలనే ఆలోచన లేదని, ఆదాయం సమకూర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్ఫష్టం చేశారు. 80 ఫీట్ల రోడ్లకు అనుసంధానం ఉన్న పారిశ్రామిక భూములను 50 శాతం ఎస్‌ఓఆర్ (స్టాండర్డ్ ఆఫ్‌సెట్ రేట్) ఆధారంగా పారదర్శకంగా కన్వర్ట్ చేసుకునే అవకాశం కల్పించామని, కన్వర్షన్లు పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని భట్టి విక్రమార్క అన్నారు.
నాచారం, మౌలాలి, ఉప్పల్, జీడిమెట్ల, బాలనగర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాలు గతంలో నగరానికి వెలుపల పరిశ్రమల కోసం ఏర్పాటు చేయబడ్డాయని, కానీ హైదరాబాద్ విస్తరణతో ఇవి ఇప్పుడు నివాస ప్రాంతాల మధ్యకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కాలుష్య సమస్యను నివారించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించే అవసరం ఏర్పడిందని ఆయన వివరించారు. ఢిల్లీలో లాగా కాలుష్య పరిస్థితి హైదరాబాద్‌లో రాకుండా ముందస్తు చర్యలతో సమగ్ర, పారదర్శకమైన ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
