Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పించడమే హైడ్రా లక్ష్యం

హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పించడమే హైడ్రా లక్ష్యం

Gaddamidi Naveen
19 మార్చి, 2026

భవిష్యత్తులో వరదలు ముంచెత్తని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు.

వర్షాకాలంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం వల్ల గతేడాది భారీ వర్షాలు పడినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదని ఆయన చెప్పారు. నగరంలోని గొలుసుకట్టు చెరువులు, వాటిని అనుసంధానించే వరద కాలువలను పునరుద్ధరించడం కీలకంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటివరకు 24 చెరువుల పునరుద్ధరణ చేపట్టగా, అందులో మూడు పూర్తయ్యాయని తెలిపారు.

సెంట్రల్ వాటర్ కమిషన్, కృష్ణా-గోదావరి బేసిన్ సంస్థల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు, కాలువలను సంరక్షించుకోవడం అత్యవసరమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని, ఆక్రమణలను తొలగిస్తూ వాటిని కాపాడుతున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇళ్ల కొనుగోలు సమయంలో కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

దేశంలోని ప్రధాన నగరాల మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా జనాభా గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. 1975లో 2.1 మిలియన్‌గా ఉన్న జనాభా ప్రస్తుతం 13 మిలియన్లకు చేరిందని పేర్కొన్నారు. అయితే సహజ వనరులు తగ్గిపోతున్నాయని, 1975 నుంచి 2024 మధ్య నగరంలోని 61 శాతం చెరువులు నశించాయని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డేటాను ఉదహరించారు. నగరంలో సుమారు 30 వేల నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.

బతుకమ్మకుంట పునరుద్ధరణతో ఆ ప్రాంతంలో వరద ముప్పు తగ్గిందని, ప్యాట్నీ నాలా ఆక్రమణలు తొలగించడం ద్వారా తొమ్మిది బస్తీలకు ఉపశమనం కలిగిందని క‌మిష‌న‌ర్ చెప్పారు. అమీర్‌పేటలో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించి వరదలను నియంత్రించామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ శాఖల చట్టపరమైన అధికారాలను హైడ్రాకు అప్పగించడం వల్ల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునే వీలు కలిగిందన్నారు. నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణహిత అభివృద్ధి దిశగా హైడ్రా చర్యలు కొనసాగుతాయని క‌మిష‌నర్ స్పష్టం చేశారు.