
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణలో పర్యటించారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్‌లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమం ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
రాహుల్ గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు కలిసి వికారాబాద్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 21న ప్రారంభమైన పది రోజుల 'సంఘటన్ సృజన్ అభియాన్’లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి, ఎన్నికల వ్యూహాల రూపకల్పన, ప్రజలతో మరింత సమీప సంబంధాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మీడియాకు అనుమతి లేకుండా అత్యంత గోప్యంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్తు కార్యాచరణపై లోతుగా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పర్యటన ముగించుకుని సాయంత్రం రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.
