Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ మహిళల హాకీ జట్టు

హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ మహిళల హాకీ జట్టు

Gaddamidi Naveen
1 మార్చి, 2026

ఎఫ్‌ఐహెచ్ (అంతర్జాతీయ హాకీ సమాఖ్య) మహిళల హాకీ ప్రపంచకప్ 2026’ క్వాలిఫైయర్స్ పాల్గొనేందుకు ఇంగ్లాండ్ జాతీయ జట్టు శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. మార్చి 8 నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ 8 దేశాల జ‌ట్టు పాల్గొననున్నాయి.

ఇంగ్లాండ్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు 11 సార్లు ప్రపంచకప్‌లో పాల్గొన్న ఈ జట్టు, 2010 ఎడిషన్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఈసారి కూడా బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే ప్రధాన ప్రపంచకప్‌కు అర్హత సాధించడం లక్ష్యంగా పట్టుదలతో ఉంది.

జట్టు రాక సందర్భంగా కెప్టెన్ ఫ్లోరా పీల్ మాట్లాడుతూ, మేము ఇంగ్లాండ్‌లో కఠినమైన శిక్షణ పొందాము. ఇటీవల చైనాలో జరిగిన ప్రో లీగ్‌లో బలమైన జట్లతో తలపడటం మాకు మంచి ప్రాక్టీస్‌గా మారింది. ప్రస్తుతం జట్టు మంచి ఫామ్‌లో ఉంది అని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని వేడి వాతావరణానికి అలవాటు పడేందుకు తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి క్రీడాకారిణి లిలీ వాకర్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. భారతదేశంలో ప్రేక్షకుల మద్దతు, ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. జట్టులోని పలువురు ఆటగాళ్లు ఇప్పటికే భారత్‌లో ఆడిన అనుభవం కలిగి ఉన్నారని, ఇక్కడి ప్రేక్షకుల ఉత్సాహభరితమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎండను తట్టుకునేందుకు సౌనా శిక్షణతో పాటు ప్రత్యేక ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు.

షెడ్యూల్ వివరాలు

పూల్-ఏలో ఉన్న ఇంగ్లాండ్ తన ప్రస్థానాన్ని ఇలా కొనసాగిస్తుంది.

• మార్చి 8: ఇటలీతో తొలి మ్యాచ్.

• మార్చి 9: రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో తలపడనుంది.

• మార్చి 11: ఆస్ట్రియాతో చివరి గ్రూప్ మ్యాచ్.

ప్రపంచకప్‌కు లభించే మూడు స్థానాల్లో ఒకదాన్ని సాధించేందుకు ఈ పోటీలు కీలకంగా మారనున్నాయి.