Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌కు ఆర్టీసీ అదనపు బస్సులు

హైదరాబాద్‌కు ఆర్టీసీ అదనపు బస్సులు

T Venkata Ramana
6 అక్టోబర్, 2025

దసరా పండుగ సందర్భంగా వరుస సెలవులకు స్వగ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తె లంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెలవులు ముగియడంతో ఆదివారం నుంచే తిరుగు ప్రయాణమయ్యే వారి రద్దీ భారీగా పెరగుతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అదనపు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

మరో రెండు రోజులు ప్రత్యేక సర్వీసులు

ఆదివారం రాత్రి 9 గంటల వరకు తిరుగు ప్రయాణ రద్దీ మరింత ఎక్కువగా కొనసాగుతుంది. దీంతో సోమవారం కూడా హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరో రెండు రోజుల పాటు అదనపు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

1050 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు

ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి టీజీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ దిశగా 1050 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చింది. ఈ ప్రత్యేక బస్సుల్లో అత్యధికంగా వరంగల్, కరీంనగర్ రీజియన్ల నుంచే నడిపినట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్ రీజియన్ నుంచి 229 ప్రత్యేక బస్సులు, కరీంనగర్ రీజియన్ నుంచి 211 ప్రత్యేక బస్సులు, నల్గొండ రీజియన్ నుంచి 137 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులు రద్దీకి ఆందోళన చెందకుండా ఆర్టీసీ అందిస్తున్న ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, ప్రధాన బస్ స్టేషన్లలో సిబ్బందిని పెంచడంతో పాటు పర్యవేక్షణను కూడా ముమ్మరం చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌కు ఆర్టీసీ అదనపు బస్సులు - Tholi Paluku