Let's talk: editor@tmv.in
హైడ్రో ప్రాజెక్టులు, హైవేలు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

హైడ్రో ప్రాజెక్టులు, హైవేలు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Pinjari Chand
19 మార్చి, 2026

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుద్ధ ఇంధనం, మౌలిక వసతులు, రైతుల సంక్షేమంపై దృష్టి సారిస్తూ మూడు ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.

చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.2,584 కోట్ల పథకం

2026-27 నుంచి 2030-31 వరకు అమలు చేసే స్మాల్ హైడ్రో పవర్ (ఎస్‌హెచ్‌పీ) డెవలప్‌మెంట్ స్కీమ్‌లకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.2,584.60 కోట్ల వ్యయంతో సుమారు 1,500 మెగావాట్ల సామర్థ్యంతో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. 1 నుంచి 25 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగపడతాయి. ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.3.6 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 30శాతం వరకు సహాయం (గరిష్టంగా రూ.30 కోట్లు) అందుతుంది. ఇతర రాష్ట్రాలకు మెగావాట్‌కు రూ.2.4 కోట్లు లేదా 20శాతం వరకు (గరిష్టంగా రూ.20 కోట్లు) సాయం ఉంటుంది. ఈ పథకం ద్వారా సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. సుమారు 51 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా.

యూపీలో రూ.6,969 కోట్ల హైవే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ బరాబంకి–బహ్రైచ్ మధ్య 101.5 కిమీ పొడవైన 4-లేన్ యాక్సెస్ కంట్రోల్ నేషనల్ హైవే-927 నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.6,969.04 కోట్లు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం)లో నిర్మించే ఈ రహదారి ద్వారా ప్రయాణ సమయం సుమారు ఒక గంటకు తగ్గనుంది. రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం మెరుగుపడతాయి. ఈ మార్గం ద్వారా లక్నో, శ్రావస్తి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రూపైడిహా ల్యాండ్ పోర్ట్‌కు అనుసంధానం మెరుగవుతుంది. భారత్–నేపాల్ వాణిజ్యానికి ఇది కీలక మార్గంగా మారనుంది.

పత్తి రైతులకు ఊరట.. సీసీఐకి రూ.1,718 కోట్లు

పత్తి రైతులకు మద్దతుగా 2023-24 సీజన్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద కొనుగోళ్లకు సంబంధించిన ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌గా రూ.1,718.56 కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 32.84 లక్షల బేళ్ల పత్తి కొనుగోలు చేసి సుమారు 7.25 లక్షల రైతులకు లాభం చేకూరింది. రైతుల ఖాతాల్లో నేరుగా రూ.11,712 కోట్లు జమ చేశారు. దేశంలో సుమారు 60 లక్షల మంది రైతులు పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. పత్తి రంగం ద్వారా 4 నుంచి 5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. ఈ నిర్ణయాలతో శుద్ధ ఇంధనం, రవాణా మౌలిక వసతులు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

హైడ్రో ప్రాజెక్టులు, హైవేలు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు - Tholi Paluku