Let's talk: editor@tmv.in
హైడ్రా ఫైర్ సేఫ్టీ పాఠాలు షురూ

హైడ్రా ఫైర్ సేఫ్టీ పాఠాలు షురూ

Gaddamidi Naveen
4 ఫిబ్రవరి, 2026

నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు హైడ్రా విస్తృత స్థాయిలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవల నాంపల్లిలోని ఫర్నీచర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు నగరంలో చోటుచేసుకున్న పలు ఘటనల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని హైడ్రా గుర్తించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో వెల్లడికావడంతో, అవగాహన కార్యక్రమాలతో పాటు కఠిన చర్యలకు కూడా సిద్ధమైంది.

ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయడానికి నెల రోజుల గడువును ఇస్తూనే, నగరవ్యాప్తంగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగితే మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలి, ప్రాణాలు, ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రజలకు వివరించింది.

ఈ కార్యక్రమాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్ల పనితీరు, స్మోక్ డిటెక్టర్ల ప్రాధాన్యతపై ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. పంజాగుట్ట, నార్సింగి, మెట్టుగూడ, కార్వాన్, షాపూర్‌నగర్, ఏఎస్ రావు నగర్, చందానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉప్పల్, బేగంపేట, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, లక్డీకాపూల్, మాధాపూర్, సనత్‌నగర్, గచ్చిబౌలి, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, అల్వాల్, బడంగపేట్, అత్తాపూర్, బంజారాహిల్స్, ఈసీఐఎల్, కొంపల్లి, నాంపల్లి, శంషాబాద్, పెద్ద అంబర్‌పేట, బాచుపల్లి, తూముకుంట తదితర ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

షాపులు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను స్పష్టంగా గుర్తించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖ 101, హైడ్రా కంట్రోల్ రూమ్ 1070 లేదా 9000113667 నంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించి కార్మికులు, వ్యాపారులు సురక్షితంగా బయటపడే విధానాలను ప్రాక్టికల్‌గా చూపించారు.