
హైడ్రా ఫైర్ సేఫ్టీ తనిఖీలకు నెల రోజుల విరామం: కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్‌లో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపులు, వ్యాపార సముదాయాలను సీజ్ చేసే చర్యలకు నెల రోజుల విరామం ఇస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఈ గడువు సమయంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని షాపుల యజమానులు, వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. నెల రోజుల తర్వాత తనిఖీలు మరింత కఠినంగా నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యాపార సంఘాల ప్రతినిధులు, షాపుల యజమానులతో పాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను అధికారులు విపులంగా వివరించారు. గతంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి తొమ్మిది షాపులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల గడువు ఇవ్వాలని వ్యాపార సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సీజ్ చేసిన షాపుల యజమానుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న అనంతరం వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్తులో నిబంధనల ఉల్లంఘనకు ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేసింది.
అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్ వంటి రద్దీ వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఫైర్ విభాగాల సమన్వయంతో ఫైర్ సేఫ్టీ నిబంధనలను రూపొందించి కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో సమావేశాలు నిర్వహించి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలను ప్రదర్శించి, వాటి కారణాలను వివరించారు.
సెల్లార్లను గోదాములుగా మార్చవద్దని కమిషనర్ సూచించారు. సెల్లార్లలో ప్రమాదం జరిగితే బయటకు వచ్చే అవకాశం ఉండదని, నాంపల్లి ఘటన ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని, అలా చేస్తే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని తెలిపారు.
ఫైర్ సేఫ్టీ కోసం ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ సరిగా ఉండాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ వైర్లు ఉపయోగించాలి, అధిక లోడ్‌తో ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని హెచ్చరించారు. సెల్లార్లలో నివాసాలు, క్యాంటీన్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.
