
హైడ్రా ప్రజావాణికి 65 ఫిర్యాదులు
గతంలో లేఔట్లలో పచ్చదనం కోసం, ప్రజల విశ్రాంతి కోసం కేటాయించిన పార్కులు, ఓపెన్ స్థలాలు నేడు క్రమంగా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసి అమ్మకాలు జరుపుతున్నారని పలు కాలనీలకు చెందిన నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు అందగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని నేరుగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
లేఔట్లు వేసిన సమయంలో పార్కులుగా చూపించిన స్థలాలను, గిఫ్ట్ డీడ్ల ద్వారా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అప్పగించినప్పటికీ, ఆ స్థలాలు తర్వాత ప్లాట్లుగా మారుతున్నాయని ఫిర్యాదుదారులు వాపోయారు. కేవలం పార్కులే కాదు, రహదారులు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన ఖాళీ స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని వారు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా భాగ్యత్‌నగర్ మండలం, సర్వే నంబర్ 97లోని శ్రీరాంనగర్ కాలనీలో 300 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులు కబ్జాకు గురవుతున్నాయని కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ కాలనీలో నాలుగు చోట్ల పార్కుల స్థలాలను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని, వెంటనే వాటిని కాపాడాలని హైడ్రాను కోరారు. అదే జిల్లాలో సరూర్‌నగర్ మండలం చంపాపేట్ గ్రామంలోని దుర్గాభవానీ నగర్‌లో 361 గజాల పార్కు ఇంటి స్థలంగా మారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో పార్కులు, ప్రజావసర స్థలాలపై ఆక్రమణలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్ నంబర్లు 317–318, 284–285, 265–266, 259–260, 320 సమీపంలోని పార్కులతో పాటు, 336–337 మధ్య ఉన్న మొత్తం ఆరు పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. గతంలో జీహెచ్ఏంసీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినా, రాజకీయ జోక్యంతో పనులు నిలిచిపోయాయని వారు వాపోయారు.
మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేట సర్కిల్, ఆల్మాస్‌గూడ 57వ డివిజన్‌లోని శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్-2లో 1983లో 460 ప్లాట్లతో లేఔట్ వేశారు. ఇందులో 2260 గజాల స్థలాన్ని పార్కుగా కేటాయించగా, ఇప్పటికే ఆ స్థలంలో ఆరు ఇళ్లు నిర్మించారని, మిగిలిన స్థలాన్ని అయినా రక్షించాలని నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు.
అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని విజయవిహార్ ఎన్‌క్లేవ్ లేఔట్‌లో రహదారులు, వరద కాలువ కోసం వదిలిన 20 అడుగుల ఖాళీ స్థలాన్ని పక్కనున్న భూయజమానులు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. లేఔట్ ప్రకారం ఆ స్థలాన్ని తమకు అందజేయాలని కోరారు. అలాగే మచ్చబొల్లారంలోనే ఉన్న శ్రీ సాయి రెడ్డి లేఔట్ సమీపంలోని మూత్కుల్ కుంట వద్ద అక్రమ నిర్మాణాల కారణంగా నీటి ప్రవాహం ఆగిపోయి, లేఔట్‌లోని సుమారు 90 ప్లాట్లు వరద ముప్పులో ఉన్నాయని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ గందంగూడలోని గ్రీన్ పార్క్స్ కాలనీలో 30 అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి 12 అడుగులకు పైగా కుదింపుచేసినట్టు కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో తమకు దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మణికొండలోని వైఎస్‌ఆర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీలో పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన 2236 గజాలు, 1163 గజాల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని కాలనీ ప్రతినిధులు తెలిపారు. వక్ఫ్ భూములుగా పేర్కొంటున్న స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో వెంకటేశ్వర నగర్–వైఎస్‌ఆర్ కాలనీలను కలుపుతూ 60 అడుగుల రహదారిని అందుబాటులోకి తెచ్చిన హైడ్రా చర్యలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించి, ప్రజావసర స్థలాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
