
హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు
ప్రజావసరాల కోసం కేటాయించిన భూములు, పార్కులు, రహదారులు, చెరువులు కొందరి ధనదాహానికి బలైపోతున్నాయని పలువురు పౌరులు సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో వాపోయారు. ఆర్థిక, అంగబలంతో జరుగుతున్న భూకబ్జాలను నిరోధించి, వేలాది మందికి ప్రయోజనం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చురుకైన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులను అభినందిస్తూ, అదే నమ్మకంతో తాము కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని పలువురు తెలిపారు.
హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఉన్న ఏఎంఆర్ టౌన్‌షిప్‌లో రెండు పార్కులు, రెండు రహదారులు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.అలాగే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో ప్రభుత్వ భూములపై కబ్జాలు జరుగుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ప్రాతినిధులు పేర్కొన్నారు. అమీర్‌పేట మండలంలోని సర్వే నంబర్లు 102/1, 102/3లో పార్క్ కోసం కేటాయించిన 1550 గజాల భూమిని ఆక్రమిస్తున్నారని సంజీవరెడ్డినగర్ నివాసితులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు.
మొత్తం 61 ఫిర్యాదులు హైడ్రా ప్రజావాణికి సోమవారం అందాయి. వాటిని హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్‌కుమార్ పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు అలుగు ఎత్తు పెంచడంతో పాటు నాలుగు తూములు మూసేయడం వల్ల చెరువు విస్తీర్ణం 93 ఎకరాల నుంచి 400 ఎకరాలకు పెరిగిందని, దాని వల్ల పరిసర లేఔట్లు మునిగిపోతున్నాయని ప్లాట్ యజమానులు తెలిపారు. చెరువు నీరు బయటకు పోకపోవడంతో కిందనున్న ఇతర చెరువులు ఎండిపోతున్నాయని వాపోయారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడలో పాఠశాల భవనం కోసం కేటాయించిన 1967 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, దానిపై వెంటనే ఫెన్సింగ్ వేయాలని శ్రీ వెంకట సాయి కాలనీ వాసులు కోరారు.
అలాగే రంగారెడ్డి జిల్లా మణికొండలోని 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిలో 1.10 ఎకరాలను పార్కుగా అభివృద్ధి చేయాలని శ్రీరాం నగర్ నివాసితులు విజ్ఞప్తి చేశారు. గుట్టలబేగంపేటలోని మేడికుంట చెరువు చుట్టూ జరుగుతున్న ఆక్రమణలు భూగర్భ జలాలపై ప్రభావం చూపవచ్చని స్థానికులు హెచ్చరించారు. చెరువును పూర్తిగా అభివృద్ధి చేసి రక్షించాలని వారు హైడ్రాకు కోరారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుట్టలబేగంపేటలోని మేడికుంట చెరువును కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 24.19 ఎకరాలున్న చెరువుకు ఒక వైపు 80 అడుగుల రహదారి ఉండగా.. లోపలి వైపు నుంచి ఆక్రమణలు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ్మిడికుంట - సున్నం చెరువు మధ్య ఈ చెరువు అనుసంధానంగా ఉండేదని.. ఇప్పుడీ చెరువు ఆక్రమణలకు గురైతే భూగర్భ జలాలకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రాకు కోరారు.
హైడ్రా ప్రజావాణి ద్వారా ప్రజలు ఈ అంశాలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చు:
ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తారు.ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదులు సమర్పించవచ్చు.ఫిర్యాదులను సంబంధిత విభాగాధికారులు పరిశీలించి, పరిష్కార చర్యలు తీసుకునేందుకు బాధ్యతలను అప్పగిస్తారు.ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, ప్రభుత్వ భూములు, ప్రజావసరాల స్థలాలను రక్షించడం, పారదర్శక పరిపాలనను నెలకొల్పడం హైడ్రా లక్ష్యం.
