Let's talk: editor@tmv.in
హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు

Gaddamidi Naveen
18 నవంబర్, 2025

నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, కబ్జాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. ఎక్కడ ఎలాగైతే సౌకర్యంగా ఉంటుందో అక్కడ అడ్డదారులు చూసి ప్రాంతాలను కాజేయడం, పాత లేఔట్లలో పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను హద్దులు చెరిపేసి ఆక్రమించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించి,సంబంధిత అధికారులను పరిశీలనకు ఆదేశించారు.

పార్కులు, ప్రజావసరాల భూములపై కబ్జా

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ విలేజ్ ఆర్‌.ఆర్‌.నగర్ అయ్యప్ప కాలనీలో సర్వే నంబర్లు 748, 749లో పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన 4,794 గజాల భూమి కబ్జాకి గురైంది అని కాలనీ సంక్షేమ సంఘం తెలిపింది.ఓల్డ్ అల్వాల్ జొన్నబండ గ్రామంలో స‌ర్వే నంబ‌రు 21పి, 576పి, 577 లో 9.61 ఎక‌రాల మేర గంగా అవెన్యూ లో 2292 గ‌జాల స్థ‌లాన్ని పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించారు. అక్క‌డ గంగా అవెన్యూ వద్ద పార్క్‌ కోసం కేటాయించిన 2,292 గజాల స్థలాన్ని హైడ్రా ఇప్పటికే ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే తిరిగి కబ్జా కాకుండా వెంటనే ఫెన్సింగ్ వేసి, పార్క్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని నివాసితులు డిమాండ్ చేశారు. అదే ప్రాంతంలో అరవింద్ ఎన్‌క్లేవ్‌కు వెళ్లే దారి నంబర్ 4ను కూడా అక్రమంగా మూసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆలయ భూములు, చెరువులు కూడా కబ్జాకు గురవుతున్నాయా?

జగద్గిరిగుట్టలోని శ్రీ గోవిందరాజు స్వామి దేవస్థానం ప్రతినిధులు, పుణ్యస్నానాలకు ఉపయోగించే కోనేరు కూడా ఆక్రమణలు ఎదుర్కొంటోందని ఫిర్యాదు చేశారని. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మకుంటలో ప్రగతినగర్ ప్రాంతం నుంచి వచ్చే మురుగువారుదల కుంటను నాశనం చేస్తోందని, వెంటనే కాలువ మళ్లింపు పనులు పూర్తి చేసి కుంటపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరారు అని కమిషనర్ తెలిపారు. ప్రగతినగర్ లేక్‌వ్యూ కాలనీ సంఘం ప్రతినిధులు, ప్రగతినగర్ చెరువు హద్దులను ప్రైవేటు వ్యక్తులు తమ ఇష్టం వచ్చినట్టు సర్వే చేసి మార్చేస్తున్నారని, దీనిపై అభ్యంతరం తెలిపితే తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అధికారిక సర్వే చేస్తే స్థానికంగా వివాదాలు నివారించబడతాయని హైడ్రాను కోరారు అని పేర్కొన్నారు.

రహదారులపై బారికేడ్లు, అనధికార వ్యాపారాలు

అంబర్‌పేట, గోల్నాక ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వరనగర్ బస్తీలో రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని, అనుమతి లేని వ్యాపారాలు నివాసితులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అక్కడి ప్రజలు తెలిపారు. వెంటనే బారికేడ్లు తొలగించాలని హైడ్రాను కోరారు.నగరంలో పెరుగుతున్న ఈ ఆక్రమణల నేపథ్యంలో హైడ్రా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.