Let's talk: editor@tmv.in
హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు

Gaddamidi Naveen
11 నవంబర్, 2025

హైద‌రాబాద్ నగరంలోని పార్కులు,ప్రభుత్వ భూములు, చెరువులు క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయనే అంశంపై పలు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.పార్కుల్లో ఆలయాలు నిర్మించడంతో పాటు పక్కనే చిన్న షెడ్డులు వేసి వ్యాపారాలు సాగిస్తున్నారని వారు వాపోయారు.ఈ స్థలాలన్నింటికీ ఫెన్సింగ్ వేసి రక్షించాలని పలు మంది సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.మొత్తం 47 ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా అదనపు కమిషనర్‌ ఎన్‌.అశోక్‌ కుమార్‌ వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యల బాధ్యతలు అప్పగించారు.

హైడ్రా అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారం గ్రామ సర్వే నంబర్‌ 188లో 30గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని బాలాజీ ఎన్‌క్లేవ్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రాతినిధులు తెలిపారు.60 కాలనీల్లో 60వేలకు పైగా ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మించేందుకు ఈ స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పెద్ద చెరువు విస్తీర్ణం గత కొంతకాలంగా పెరిగిపోవడంతో ఎగువ భాగంలోని నివాసాలు నీట మునిగిపోతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.తూములు మూసేయడం,అలుగు ఎత్తు పెంచడం వల్ల మురుగు నీరు చెరువులో నిల్వవుతోందని పేర్కొన్నారు.చెరువు నిజమైన విస్తీర్ణాన్ని నిర్ణయించి,ఎగువ ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.గ‌తంలో వేసిన ర‌హ‌దారులు,విద్యుత్ స్తంభాలు నీట మునిగినట్టు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతున్నాయ‌ని ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రైన విధానాన్ని పాటించి చెరువు వాస్త‌వ విస్తీర్ణం నిర్ణ‌యించాల‌ని కోరారు.ఇదే ప‌రిస్థితి రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం మండ‌లంలోని రావిర్యాల విలేజ్‌లో కూడా ఉంద‌ని అక్క‌డ నివాసితులు ఫిర్యాదు చేశారు.రావిర్యాల తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కాలనీలో 545 ప్లాట్ల‌తో ఉన్న ఈ లే ఔట్‌లో ఉన్న ఖాళీ స్థ‌లాలు క‌బ్జాల‌కు గురి అవుతున్నాయి.క్రమంగా కబ్జా అవుతున్నాయని,పార్కులుగా కేటాయించిన ప్రదేశాల్లో మందిరాలు కడుతున్నారని కొన్నిచోట్ల షెడ్డులు వేసి అద్దెకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.రోడ్లు కూడా బ్లాక్‌ చేయబడుతున్నాయని వాపోయారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో పిల్లల పార్కు స్థలం వ్యాపార దందాలకు అడ్డాగా మారిందని స్థానికులు తెలిపారు.1300 గజాల పార్కు స్థలంలో ఐరన్‌,స్టీల్‌ దుకాణాలు,సర్వీసింగ్‌ సెంటర్లు నెలకొల్పారని,పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు.ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ పార్కులు,చెరువులు,ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా వెంటనే ఫెన్సింగ్‌ వేసి కాపాడండి అని హైడ్రా ప్రజావాణిలో విన్నపం చేశారని హైడ్రా అధికారులు ఈ ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామ‌ని పేర్కొన్నారు.