
హైడ్రా ప్రజావాణికి 46 ఫిర్యాదులు
నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడితేనే నగరానికి పర్యావరణ భద్రత సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. చెరువులు, నాలాల అనుసంధానాన్ని పరిరక్షించినప్పుడే వరదల బెడద లేని నగరాన్ని చూడగలమని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెరువుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పార్కుల అభివృద్ధిని కూడా చేపట్టాలని ప్రజలు హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు.
లే ఔట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసి పచ్చదనం పెంచాలని, నివాసాల మధ్య ఉన్న చిన్నచిన్న ప్రభుత్వ భూములకు కంచెలు వేసి ప్రజలకు ఆక్సిజన్ అందించేలా తీర్చిదిద్దాలని కోరారు. నిజాంపేటలోని తుర్క చెరువు పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేయాలని, మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చిన్నచెర్లపల్లిలోని వెంకటరెడ్డి కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని వెంటనే హైడ్రా జోక్యం చేసుకోవాలని పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు అందాయని. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించమని తెలిపారు.
ప్రధాన ఫిర్యాదులు ఇలా...
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామంలో కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రభుత్వ భూమి డంపింగ్ యార్డుగా మారిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అక్కడ చెత్తను వేయడం, తగలబెట్టడం వల్ల కాలనీలు, అపార్టుమెంట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రుల వ్యర్థాలు కూడా అక్కడే పడేస్తున్నారని పేర్కొన్నారు. బోరు నీటిపై ఆధారపడే తమ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, దుర్గంధం, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలాన్ని కాపాడి ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.
రామంతాపూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు మునిగిపోయాయని, భూమికి భూమి లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని అక్కడి నివాసితులు కోరారు. 1958 గ్రామపంచాయతీ లే ఔట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్లలో కొన్నింటికి ఇళ్లు ఉన్నప్పటికీ తమవి నీట మునిగాయని తెలిపారు. చెరువు బండ్ నిర్మాణ సమయంలో పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కురుములగూడ జన్నారం కాలనీలో రాజీవ్ గృహకల్ప కింద నిర్మించిన బ్లాకుల వద్ద పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణాలు, అదనపు గదులు నిర్మించారని ఫిర్యాదు చేశారు. దీంతో పార్కింగ్, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వెంటనే ఖాళీ చేయించాలని హైడ్రాను కోరారు.
నిజాంపేటలో తుర్క చెరువు కట్టతో పాటు చెరువు కింద ఉన్న మూడు చోట్ల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతోందని, పెద్ద నిర్మాణ సంస్థలు ప్రహరీలు నిర్మిస్తున్నాయని స్థానికులు తెలిపారు. మొత్తం 10 గుంటల ప్రభుత్వ భూమిని ప్రజావసరాలకు వినియోగించి చిన్న పార్కులుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే అమీన్‌పూర్ పెద్ద చెరువు నుంచి బందం కొమ్ము చెరువుకు వెళ్లే వరద కాలువపై ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు నాలాను ఆక్రమించడం వల్ల వరద నీరు నిలుస్తోందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని హైడ్రాను కోరారు.
