Let's talk: editor@tmv.in
హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు

Gaddamidi Naveen
3 మార్చి, 2026

అక్రమ కట్టడాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. సోమవారం జరిగిన ఈ విచారణలో మొత్తం 42 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రధానంగా చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై బాధితులు గళమెత్తారు.

ఈ సంద‌ర్బంగా ప్రగతినగర్‌లో ప్రజావసరాలకు కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురవుతోందని ఆలేటి శ్రీనివాసరావు, జశ్వంత్ తదితరులు పేర్కొన్నారు. అదేవిధంగా స్మశానవాటికకు ఆనుకుని ఉన్న చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించిన దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కబ్జా అవుతోందని తెలిపారు. సర్వే అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు చెబుతూ హైడ్రా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో స్మశానవాటిక నిర్మాణం జరుగుతోందని, కోర్టులో కేసు ఉన్నప్పటికీ పనులు ఆగడంలేదని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయానికి చెందిన భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారని, గ్రామస్తులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిలిచిందని, కేసు కోర్టులో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని నివాసితులు పేర్కొన్నారు.

అమీన్‌పూర్ సర్వే నంబర్ 971లోని పోచమ్మకుంటలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో 25 అడుగుల రహదారిని ఐదు అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించడంతో అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు - Tholi Paluku