
హైడ్రా పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయమా? :కేటీఆర్
హైడ్రా పేరుతో ప్రభుత్వం రాష్ట్రమంతా అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో “పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయమా?” అనే నినాదంతో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో హైడ్రా చర్యల వల్ల ఎంతో మంది పేదలు బలయ్యారు. మూసీ వల్లా, హైడ్రా వల్లా వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. చాంద్రాయణగుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కట్టడాలే కనిపించాయి. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆధునిక సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 42 ఫ్లైఓవర్లు, ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్లు నిర్మించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఒక్క కొత్త నిర్మాణం కూడా చేయలేదు, కూల్చడమే చేసిందని అన్నారు.
కేటీఆర్ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూలగొట్టి, పెద్దల ఇళ్లకు మాత్రం తాకడం లేదు. ఇది ఎలాంటి న్యాయం? ఒక గర్భిణి గృహప్రవేశం చేసిన వారం రోజుల్లో బుల్డోజర్ వచ్చి ఇల్లు కూల్చింది. మూడేళ్ల చిన్నారి ఆకలితో ఏడ్చిన పరిస్థితి ఏర్పడింది. హైడ్రాపై భట్టి విక్రమార్క ప్రజెంటేషన్‌లో బిల్డర్ల పేర్లు చెప్పారు, కానీ ప్రభుత్వం వారిపై చర్య తీసుకోలేదు. పేదల ఇళ్లు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు అని పేర్కొన్నారు.
అలాగే కేటీఆర్ కొంతమంది పెద్దల పేర్లు ప్రస్తావిస్తూ, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఇంటి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లే ధైర్యం ఉందా? మంత్రి వివేక్ హిమాయత్ సాగర్ వద్ద ఇల్లు కట్టుకున్నారు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. వీరికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? పేదవాడు కడితే తప్పు, పెద్దలు కడితే న్యాయమా? అని ప్రశ్నించారు.
అలాగే, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి గాజులరామారంలో 11 ఎకరాల భూమికి ప్రభుత్వం అండగా నిలుస్తూ, పేదల ఇళ్లను మాత్రం కూల్చేస్తుందని విమర్శించారు. “హద్దులు సమస్యగా చెబుతున్న అధికారులు పెద్ద బిల్డర్ల ముందు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే వారికి ఒక న్యాయం, మిగతావారికి మరొక న్యాయం ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మూసీ నదిలో అడ్డంగా నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆయన ఆరోపించారు. “పేదల ఇళ్లకు బుల్డోజర్‌లు పంపే ప్రభుత్వం, పెద్ద బిల్డర్లకు మద్దతు ఇస్తుందన్నారు. యూపీలో బుల్డోజర్‌లను వ్యతిరేకించిన రాహుల్ గాంధీ, తెలంగాణలో అదే బుల్డోజర్‌లు పేదల ఇళ్లపై నడుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుంది. ఆ తర్వాత ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. పేదవాడికైనా, ధనవంతుడికైనా ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన హక్కులు, కాని ఈ ప్రభుత్వం ఆ సూత్రాన్ని తాకట్టు పెట్టింది అని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
