
హైడ్రా పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైదరాబాద్ పాతబస్తీలో గజం ఖాళీ స్థలం కూడా దొరకని అత్యంత జనసాంద్రత గల ప్రాంతంలో, ఏకంగా 7 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం రక్షించింది. అక్రమ ఆక్రమణల బారిన పడిన ఈ భూమిని ఖాళీ చేయించి, రెవెన్యూ అధికారుల సమక్షంలో, పోలీసు బందోబస్తు మధ్య చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది. దీని వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కబ్జాదారులు పోలీసు కేసులు, కోర్టు జరిమానాలను సైతం లెక్కచేయకుండా, ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించి లోపల ప్లాట్లు చేసేందుకు ప్రయత్నించారు. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గతంలో వీరికి కోటి రూపాయల జరిమానా పడినా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది, పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. ఇనుప రేకులను తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని తెలిపే హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
కబ్జా కోరల్లో 9 ఎకరాల భూమి
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని మొహమ్మద్‌నగర్, లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్, ఎఫ్, వార్డు నంబర్ 274 పరిధిలో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని. ఇందులో ఇప్పటికే సుమారు 2 ఎకరాలు అక్రమంగా ఆక్రమణకు గురై నివాసాలుగా మారాయని. ఆ నివాసాలను ఇబ్బంది పెట్టకుండా, ప్రస్తుతం కబ్జాలో ఉన్న మిగిలిన 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందని అధికారులు తెలిపారు.
సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ప్రకారం ఈ భూమిలో ఒక చెరువు, నాలా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కబ్జాదారులు చెరువు ఆనవాళ్లు లేకుండా మట్టితో కప్పి, ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించి లోపల జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బయటకు తెలియకుండా చేశారు. ఈ భూమిపై ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు, ఇతరులు హక్కులు చెప్పుకుంటూ పోరాటం చేస్తున్నారు. వీరిపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, వెంకటేష్ వారసుల నుంచి భూమిని కొనుగోలు చేశానంటూ పట్టాభి రామిరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసిన కోర్టు, న్యాయస్థాన సమయాన్ని వృథా చేసినందుకు రూ.కోటి జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ కబ్జాదారులు భూమిని ఖాళీ చేయకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
హైడ్రా చర్యలతో మొహమ్మద్‌నగర్, లాలితాబాగ్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకున్నందుకు కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రెండు కమ్యూనిటీల మధ్య సున్నితమైన ప్రాంతంలో అక్రమ కబ్జాలు వివాదాలకు దారితీస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసిన హైడ్రా చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే కబ్జాదారులు మాయం చేసిన చెరువు, నాలాలను పునరుద్ధరిస్తే పాతబస్తీ పరిధిలో వరద ముప్పు గణనీయంగా తగ్గుతుందని స్థానికులు తెలిపారు. ఈ చర్యలకు నాయకత్వం వహించిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
