
హైడ్రా పర్యావరణ పరిరక్షణలో కృషి.. 'స్పీకిన్ ఆసియా డైలాగ్స్ ఫోరం' ప్రశంసలు
సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరమని 'స్పీకిన్ ఆసియా డైలాగ్స్ ఫోరం-2026' స్పష్టం చేసింది. మెరుగైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఈ ఫోరం అభిప్రాయపడింది. ఈ దిశగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చేస్తున్న కృషిని ఫోరం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
తాజ్ ఫలక్‌నుమాలో ప్రతినిధుల సమావేశం
ది గ్రేట్ ఇంటిగ్రేషన్: టెక్నాలజీ, టాలెంట్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇన్ ఆసియా అనే అంశంపై హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో స్పీకిన్ ఆసియా డైలాగ్స్ ఫోరం–2026 సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ రంగం, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా హైడ్రా చేపడుతున్న కార్యకలాపాల పట్ల వారు విశేష ఆసక్తి కనబరిచారు.
హైడ్రా కేవలం ఆక్రమణల తొలగింపు సంస్థ కాదు..
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హైడ్రా లక్ష్యం కేవలం ఆక్రమణల తొలగింపుకే పరిమితం కాదని, ప్రజా ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ భద్రత వంటి విస్తృత లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. పర్యావరణ హితమైన నగరాన్ని తీర్చిదిద్దడమే హైడ్రా అభిమతమని, అందులో భాగంగా చెరువులు, వాటిని అనుసంధానం చేసే వరద కాలువలను పరిరక్షిస్తూ నగరాన్ని భవిష్యత్‌కు సురక్షితంగా మారుస్తున్నామని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు హైడ్రా ద్వారా 1,350 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ భూముల విలువ సుమారు రూ.65 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. మందస్తు చర్యలతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా నగరాన్ని సిద్ధం చేస్తున్నామని, ఎలాంటి వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభతో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంత ఉందో, అదే స్థాయిలో పర్యావరణ హితమైన నగరాల నిర్మాణం కూడా అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుజ్జీవనం, పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు హైడ్రా చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని పట్టణ జీవనం దుర్భరంగా మారుతోందని, అటువంటి పరిస్థితుల్లో హైడ్రా దిశానిర్దేశకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్పీకిన్ ఆసియా డైలాగ్స్ ఫోరం–2026 ఫౌండర్ దీప్షికా కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరితో సహా పలు విద్యా సంస్థలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
