Let's talk: editor@tmv.in
హైడ్రా చర్యలు.. ఐటీ కారిడార్‌లో రూ. 1200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

హైడ్రా చర్యలు.. ఐటీ కారిడార్‌లో రూ. 1200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలో మరోసారి హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించి ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 55లో ఉన్న 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మంగళవారం హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర రూ. 1200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాంతం ఐటీ హబ్‌కు అత్యంత చేరువలో ఉండటంతో పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సుమారు 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ తమదిగా పేర్కొంటూ వినియోగించుకుంటుండగా, వాసవి నిర్మాణ సంస్థ అక్కడ ఆర్‌సీసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, నిర్మాణ సామగ్రి నిల్వ చేయడంతో పాటు కార్మికుల కోసం తాత్కాలిక షెడ్డులు నిర్మించింది.

అదేవిధంగా, ఇదే సర్వే నంబర్‌లో ఉన్న మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తన స్వంతంగా పేర్కొంటూ వచ్చారు. ఆ భూమిని కాపాడేందుకు బౌన్సర్లను కూడా నియమించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. విచారణలో ఈ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూమిగా, ఇప్పటికే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నదిగా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. మంగళవారం నిర్వహించిన ఆపరేషన్‌లో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డులను తొలగించగా, ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాసవి సంస్థ స్వయంగా తొలగించుకుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మొత్తం భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంది. సర్వే నంబర్ 53లోని మొండికుంట ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడమే కాకుండా, సర్వే నంబర్ 55లో సుమారు 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తాజా చర్యలతో ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ఇకపై కూడా ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

హైడ్రా చర్యలు.. ఐటీ కారిడార్‌లో రూ. 1200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం - Tholi Paluku