
హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 52 నకిలీ ఎన్‌వోసీల గుర్తింపు
హైదరాబాద్‌లో జూనియర్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల్లో భారీ స్థాయిలో ఫోర్జరీ జరిగినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌వోసీలు రూపొందించిన ఘటనను అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు పూర్తి వివరాలు ఇవ్వాలని లేఖ రాసిన హైడ్రా, జులై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు.
2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా అధికారులు దశలవారీగా పరిశీలించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 142 జూనియర్ కళాశాలలు ఎన్‌వోసీలు సమర్పించగా, వాటిలో 90 ధ్రువపత్రాలు అసలైనవిగా నిర్ధారణ అయిందని, మిగిలిన 52 ఎన్‌వోసీలు నకిలీ లేదా ఫోర్జరీ చేసినవిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పంపిన 76 ఫైర్ ఎన్‌వోసీలను పరిశీలించగా, వాటిలో 7 నకిలీవిగా గుర్తించారు. అనంతరం రెండో దశలో పంపిన 66 ఎన్‌వోసీలను రికార్డులతో సరిపోల్చగా, వాటిలో 45 ఫోర్జరీ చేసినవేనని తేలింది.
ఈ నేపథ్యంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన కళాశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు సూచించారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఫైర్ ఎన్‌వోసీల జారీ విధానం, ప్రామాణికత, ధ్రువీకరణ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
