
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై డిఫమేషన్ కేసు వేస్తా: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై పరువు నష్టం దావా వేస్తానని, ఆయన్ని కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు గతంలో రంగనాథ్ స్వయంగా లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. అదే అంశంపై తాను ధర్నా చేస్తే తనను బద్నాం చేసేలా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. హైడ్రా అధికారిక ట్విట్టర్ ఖాతాలో వాయిస్ ఓవర్‌తో వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పామని కవిత అన్నారు. ఇటీవల జరిగిన ప్రజెంటేషన్‌లో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూసీ నది రివర్‌బెడ్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని, ఇప్పుడు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మార్చి 3న తాము చేసిన ధర్నా సమయంలో ఆక్రమణ జరిగినట్లు రంగనాథ్ స్వయంగా అంగీకరించారని కవిత పేర్కొన్నారు. సుమారు 0.37 ఎకరాలు భూమి ఆక్రమణకు గురైందని, 23 మీటర్ల వరకు ఎన్‌క్రోచ్‌మెంట్ జరిగిందని ఆయన చెప్పారని తెలిపారు. నాలాలను డైవర్ట్ చేయకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల కోకాపేట్, నార్సింగ్ ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు అధికారులే పేర్కొన్నారని ఆమె అన్నారు. ఆదిత్య, కేడీఆర్ రియల్టీ అక్రమ నిర్మాణాల వల్ల ప్రాణహాని ఉందని అక్టోబర్ 22, 2025న రంగనాథ్ తహసీల్దార్‌కు రాసిన లేఖ తన వద్ద ఉందని ఆమె వెల్లడించారు. తాను ఇప్పటివరకు సాక్ష్యాలతో సహా 6 ఫిర్యాదులు ఇచ్చినా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 'హైడ్రా' అనే మహమ్మారిని ప్రజల మీదకు వదిలిందని కవిత విమర్శించారు.పేదవాళ్ల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం, భారీ అక్రమాలకు పాల్పడుతున్న పెద్దల జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు. వెలుగుమట్ల బాధితుల సమస్యలపై ఈ నెల 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు. అక్కడ ఉన్న 31 ఎకరాల భూదాన్ భూమిని, పక్కనున్న మరో 30 ఎకరాలను పెద్దలకు వెళ్లనివ్వమని, బాధితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
